Ayodhya : అయోధ్యలో తన ప్రభువును దర్శించుకున్న హనుమాన్..
Ayodhya Ram Mandir : దివ్య, భవ్య మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రజల సందర్శనార్థం అనుమతించారు. రామ్ లల్లా విగ్రహం ఉన్న ఆలయ గర్భగుడిలోకి ఓ కోతి ప్రవేశించిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.
మంగళవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి వెస్టిబ్యూల్ వైపు వెళ్లిందని ట్రస్ట్ తెలిపింది. కొత్త ఆలయ నిర్మాణానికి ముందు గుడారంలో ఉంచిన రామ్ లల్లా పాత విగ్రహమైన ఉత్సవ్ విగ్రహం వద్దకు వెళ్లింది.
విగ్రహం భద్రతపై ఆందోళన చెందిన సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది కోతి వైపు పరుగులు తీశారు. అయితే కోతి ప్రశాంతంగా వెనక్కి తగ్గి మూసివేసిన ఉత్తర ద్వారం వైపు కదిలింది. ఆ తర్వాత తూర్పు ద్వారం గుండా భక్తుల గుంపు గుండా ఎలాంటి హాని కలిగించకుండా బయటకు వచ్చింది.
కోతి సందర్శనను భద్రతా సిబ్బంది దైవ ఆశీర్వాదంగా చూశారని, తన ప్రభువు, తన తండ్రి శ్రీరాముడిని బాల రాముడిగా చూసి తరించేందుకు హనుమ వచ్చాడని ట్రస్ట్ తెలిపింది. బంటును సైతం భగవంతుడిగా చేసింది రామాయణ సుందరకావ్యం. ఆ బంటే శ్రీ హనుమంతుడు. హనుమంతుని అవతారాలుగా కనిపించేవే కోతులు రామ జన్మభూమి ఉద్యమ చరిత్ర అంతటా పునరావృత చిహ్నంగా ఉన్నాయి.
1990, అక్టోబర్ 30న కరసేవకులు బారికేడ్లను దాటి బాబ్రీ మసీదుపై కాషాయ జెండాలను ఎగురవేసినప్పుడు, ఒక కోతి మధ్య గోపురంపై కూర్చొని, గుంపును భద్రతా దళాలు చెదరగొట్టిన తరువాత ఒక జెండాను తొలగించకుండా కాపాడింది. ఈ సంఘటనను ట్రస్ట్ గుర్తు చేసుకుంది.