Ayodhya : అయోధ్యలో రామాలయం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశం యావత్తూ సిద్ధమైంది. అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు ఇప్పటికే అందించారు. ఇందులో రాజకీయ, సినీ, పారిశ్రామిక, హిందూ మత పెద్దలు ఉన్నారు. కోట్లాది హిందువుల శతాబ్దాల కల నెరవేరే రోజు కోసం సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అయోధ్య గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30గంటల సమయంలో జరుగబోతోంది. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని, ఆ సమయంలోనే ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుందని జ్యోతిషులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నట్టు తెలిపారు.
ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకన్లు. ఈ వ్యవధిలో అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఇది రాజ్యాల స్థాపనకు చాలా పవిత్రమైనదిగా నమ్ముతారు. దేశం, ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ సమయం అగ్ని, మరణం, దొంగతనం, వ్యాధుల వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందింది.
ఇలాంటి విశేషమైన ముహూర్త బలం గురించి అమెరికాలో ఉంటున్న తెలుగు పండితులు కూడా రీసెర్చి చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో వారు చెప్పారు. వారు చేసిన రీసెర్చిలో అయోధ్య ఆలయం ఎంత కాలం మనుగడలో ఉండబోతోంది.. రామ్ లల్లా ప్రతిష్ఠాపన ద్వారా జరిగే ప్రజాశ్రేయస్సు తదితర విషయాలపై స్టాటిస్టికల్ డాటా ద్వారా వారు రీసెర్చి చేస్తున్నారు. వాటి ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని వారు చెబుతున్నారు.