Ayodhya Celebration : అయోధ్యలో రామాలయం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశం యావత్తూ సిద్ధమైంది. అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే కోట్లాది హిందువుల శతాబ్దాల కల నెరవేరబోతోంది. విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30గంటల సమయంలో జరుగబోతోంది. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని, ఆ సమయంలోనే ప్రతిష్ఠాపన జరుగుతుండడంతో దేశమంతా రామ నామంతో మార్మోగిపోనుంది. మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఈ క్రతువును అయోధ్యకు వెళ్లి చూడాలనుకునే అవకాశం అందరికీ లేదు. దేశంలోని 11వేల మంది ప్రముఖుుల, అయోధ్య వాసులు, చుట్టుపక్కల ప్రజలు, ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి మాత్రమే వేడుకను తిలకించే అదృష్టం దక్కుతోంది. మిగతా కోట్లాది మంది భక్తులు టీవీలు, సోషల్ మీడియా లైవ్ ల్లో మాత్రమే వీక్షించాలి. అయితే భక్తులు ఈ వేడుకను చూసేలా కొందరు హిందూ మత సేవకులు భారీ తెరలను వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న పలు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో కూడా ఈ వేడుకలను ప్రసారం చేయబోతున్నారు. ప్రముఖ థియేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లు మొత్తం 100 స్క్రీన్లపై ఈ లైవ్ ను ప్రదర్శిస్తున్నట్టు వాటి ప్రతినిధులు ప్రకటించారు. రూ.100 టికెట్ తో ప్రేక్షకులను లోపలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైవ్ కొనసాగుతుందని, థియేటర్లకు వచ్చిన భక్తులకు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఉచితంగా అందిస్తామని చెప్పారు.
రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఓ చారిత్రక ఘట్టమని, దీన్ని పెద్ద తెరపై అందరూ చూడాలనే ఆకాంక్షతో ఈ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని 70నగరాల్లోని మల్టీప్లెక్స్ ల్లో ఈ లైవ్ ప్రసారం ప్రదర్శిస్తామని చెప్పారు. వీటి టికెట్లను ఆయా థియేటర్ వెబ్ సైట్లలోనూ, బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు.