Pawan Kalyan : కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాడు.. కులాల కుంపట్లు పెడతాడు: పవన్ ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటు ప్రసంగం చేశారు. సీఎం జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు..‘‘కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్. మనుషులను విడగొట్టే ఆయన విష సంస్కృతి కుటుంబాల్లోకి కూడా వెళ్లిపోయింది.. వివిధ కులాలు కొట్టుకు చావలనేదే జగన్ నైజం’’ అని ఆరోపించారు. ‘‘సమాజాన్ని కలిపే వారినే జనం గుర్తుకు పెట్టుకుంటారు. ప్రాణ త్యాగం చేయడం వల్లే పొట్టి శ్రీరాములును గుర్తు పెట్టుకుంటాం. వైసీపీ ఎమ్మెల్సీ అతడి కారు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు జైలు నుంచి బయటకు రాగానే బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు. సమాజానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన రూ.వేల కోట్లను ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇస్తే.. అందులో చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి జగన్ అన్నారు. సాక్షి పేపర్, భారతి సిమెంట్ లో వాటాలు ఇవ్వలేదన్నారు. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి ఇక జనాలకు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. అందరితో కలిసి ఉమ్మడి లక్ష్యం సాధించాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి ఉంటుందన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు? అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలన్నారు. ఏ ప్రభత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని, సంక్షేమ పథకాలు భవిష్యత్ లోనూ కొనసాగుతాయన్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని పవన్ చెప్పారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని రక్షించాలన్నారు. మనకు ధైర్యం ఉందని, పోరాటం చేస్తామన్నారు. ఈ సారి ఓట్లు చీలకూడదని పొత్తుల కోసం ప్రయత్నించామన్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కలిస్తే ఇక ఏ శక్తి ఆపలేదని పవన్ పిలుపునిచ్చారు.