Chandrababu Case Updates : చంద్రబాబు కేసులో అపడేట్.. రెగ్యులర్ బెయిల్ పై నేడు విచారణ
Chandrababu Case Updates : స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ టీ మల్లికార్జునరావు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబు మెడికల్ బెయిలుపై ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్య నివేదికను కోర్టుకు సమర్పించారు.
చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకోసం ఆయన చికిత్స తీసుకుంటున్నారని వారు కోర్టుకు వివరించారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 53 రోజులు గడిపిన చంద్రబాబుకు ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు అక్టోబర్ 31న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ స్కాంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతున్నది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ లో ఉంటున్న బాబు ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ గడువు ఈ నెల 28న ముగియనుంది. రెగ్యులర్ బెయిల్ విషయంపై హైకోర్టు విచారణ జరుపుతున్నది.
టీడీపీ అధినేత బాబు అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున లాయర్లు కోరబోతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు తప్ప మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పు చాలా కీలకంగా మారింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇతర కేసుల్లో చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు సీఐడీ హామీ ఇచ్చింది. అలాగే చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల విచారణ కూడా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పై వెంటనే తేల్చాలని చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టును కోరుతున్నారు.