Shock To BRS : బీఆర్ఎస్ కు షాక్.. నల్గొండ జిల్లాలో కీలక నేతల ఇండ్లలో ఐటీ సోదాలు
Shock To BRS : బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థుల అనుచరుల ఇండ్లలో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ఆయన అనుచరుల ఇండ్లలో తనిఖీలు కొనసాగాయి. దాదాపు 40 చోట్ల 30 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. భాస్కర్ రావు అనుచరుడు కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ ఇంట ఒక్కసారిగా ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది.
అయితే ఆయా చోట్ల పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల ఇండ్లలోనూ ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. మహేంద్ర ఆయిల్ పరిశ్రమ ఓనర్ మహేందర్ రవీంద్ర, ఫార్మా కంపెనీ కి చెందిన ప్రదీప్ రెడ్డి, రవీంద్రరెడ్డి ఇండ్లలో ఈ తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం.
అయితే ప్రదీప్ రెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి రూ. 7.50 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తున్నది. ఈ ప్రదీప్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడని టాక్ బయటకు వచ్చింది. అయితే ప్రదీప్ రెడ్డి నరేంద్ర రెడ్డి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరగడంతోనే ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ రైడ్స్ అనంతరం పలు రికార్డులు, పత్రాలను సీజ్ చేసినట్లు తెలుస్తున్నది. కొంతకాలంగా కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా సాగుతున్న ఈ ఐటీ దాడులు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు టర్న్ తీసుకున్నాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇస్తున్న సమాచారంతోనే ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.