Revanth Reddy Meeting Chandrababu : చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ.. ఏంటి అసలు కథ..?
Revanth Reddy Meeting Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మంచి సఖ్యత ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఆయనకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మారినా, చంద్రబాబును ఏ సమయంలోనూ విమర్శించలేదు. ఇక ప్రత్యర్థులు ఆయనకు చంద్రబాబే బాస్ అంటూ విమర్శిస్తుంటారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిందే చంద్రబాబు సూచనల మేరకు అని అంతా అనుకుంటుంటారు. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబే మాట్లాడి ఆయనకు టీపీసీసీ చీఫ్ గా అవకాశమిప్పించారని కూడా కాంగ్రెస్ నేతలే కాకుండా ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా పదే పదే చెబుతుంటారు.
ఇక ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 15 రోజులే గడువు మిగిలి ఉంది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిని ఇరు పార్టీల నేతలు మాత్రం ధ్రువీకరించలేదు. అయితే నిజంగానే రేవంత్ రెడ్డి, చంద్రబాబు తో సమావేశమయ్యారా.. అయితే ఎందుకయ్యారు.. అనే ప్రశ్న ఎదురవుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తున్నది. సర్వేలన్నీ కాంగ్రెస్ కు అధికారానికి మెజార్టీ అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంటున్నది.
అయితే తెలంగాణలో టీడీపీ శ్రేణుల మద్దతు కోసం కలిశారా.. లేదంటే ఏవైనా ఆర్థిక వనరుల కోసమా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల్లో చంద్రబాబుకు అభిమానులు ఉన్నారు. ఆయన ఒక్క మాట చెబితే స్పందించే నేతలు ఉన్నారు. అధికార పార్టీలోనూ ఆయన కు ఫాలోవర్లు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక తన మాజీ బాస్ ను రేవంత్ రెడ్డి ఈ సమయంలో ఎందుకు కలిశారా అనే చర్చ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ గెలుపునకు సహకరించాలని, అదే విధంగా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి సహకరిస్తామని చెప్పి ఉంటారని పలువురు అంటున్నారు.
దీంతో పాటు రాజకీయ చతురత మెండుగా ఉన్న చంద్రబాబు నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్ పరిణామాలు, కేసులు, ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి, ఆందోళనపై తెలంగాణ ప్రభుత్వ తీరు, ఆరోగ్యం, తదితర అంశాలపై కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి అంతే ఎంతో అభిమానమున్న చంద్రబాబు తెరవెనుక ఆయనకు సహకరించేందుకు ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ కు గత ఎన్నికల్లో సహకరించడం వల్లే తాను ఏపీ ఎన్నికల్లో ఓడిపోయానని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డికి సహకరించే చాన్సే ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ సమయంలో వీరిద్దరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.