Janasena Office : ‘జనసేన ఆఫీస్’ అద్దెకు ఇవ్వబడును.. ఇదేందయ్యా చోద్యం..మేమెక్కడా చూడలే..!

Janasena Office

Janasena Office To-let

Janasena Office Rent : రాజకీయ పార్టీ పెట్టడమంటే మాటలు కాదు.. దానికి అంగ బలమే కాదు ఆర్థిక బలం దండిగా ఉండాలి. మన వెనుకుండే జనాలను చూసి పార్టీ అయితే పెట్టేస్తాం..కానీ పార్టీ నిర్వహణ అంతా ఈజీ ఏం కాదు..రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఆఫీసులు పెట్టాలి..వాటి మెయింటనెన్స్ చూసుకోవాలి. వాటిలో గుండుపిన్ను నుంచి కుండ బిర్యానీ దాక ఖర్చులు మోసే నేతలు ఉండాలి..ఇది ఒక్క రోజుతో ముగిసే కథ కాదు కదా.. ఏళ్ల తరబడి ఆ ‘భారాన్ని’ పాపం సదరు స్థానాన్ని ఆశించే నేతలు తమ భుజస్కంధాలపై మోయాలి.  పార్టీ అధికారంలో ఉంటే ఓకే.. ఏదో రకంగా మేనేజ్ చేయవచ్చు.. కానీ ఏండ్ల తరబడిగా ఎవరు మాత్రం ఈ ‘భారాన్ని’ మీదేసుకుంటారు. ఈ ‘భారం’ నా వల్ల కాదు బాబోయ్ అంటూ కాడి తన్నేస్తారు.

ఈ సీన్ ఎక్కడో జరుగలేదు మన విశాఖలోనే జరిగింది. ఆఫీస్ రెంట్ కట్టలేమంటూ జనసేన పార్టీ నేతలు ఈ భారాన్ని ఎన్నికల వేళ వదిలించుకున్నారు. ఈ తడిసిమోపెడు అయ్యే భారం తమ వల్ల కాదు మహాప్రభో అంటూ ఆ ఇంటి ఓనర్ తో టులెట్ బోర్డు పెట్టించేశారు. ఈ ‘ఆఫీస్ అద్దెకు ఇవ్వబడును’ ఎపిసోడ్ ను ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే పార్టీ ఆఫీసునే అద్దెకు ఇచ్చే విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా..

ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చేస్తుందని అధినాయకుడు నమ్ముతున్నారు. అది మంచిదే..ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా..అయితే ఫీల్డ్ లెవల్ లో జరుగుతున్న పరిణామాలను అనేకానేన డౌట్లను రగిలించేస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు పేరుతో వచ్చిన జనసేన కూడా ఇతర మూస పార్టీల్లాగేనే వ్యవహరిస్తుండడంతో ఆ నేతలు చిన్నబుచ్చుకుంటున్నారు. పార్టీ కోసం ఏండ్ల తరబడిగా పనిచేసిన వారిని కాదని ఎన్నికల వేళ కండువాలు కప్పుకుంటున్న ‘జంపింగ్ జంపాంగ్’లకు జనసేనాని సీట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తున్నారనే బాధ జన‘నాయకుల’ గుండెలను పిండేస్తుంది.

జనసేనలో చేరడం కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చిన ఓ నేతకు ఆ పార్టీ ఇప్పుడు ఢోకా ఇచ్చింది.. పాపం ఈ నేత చాలా కాలం నుంచి పార్టీ ఆఫీస్ ను నడుపుతూ తన జేబులోని పైసలు తీసే కార్యక్రమాలు గట్రా చేసేవారు. నెలకు అరువై వేల రూపాయలు అద్దె కట్టి మరి ఆఫీస్ నడిపేవారు. ఓ నెలా, రెండు నెలలో అయితే పర్లేదు.. ఏండ్ల తరబడి అంటే మాటలు కాదు.. ఇంత భారం మోసినా పార్టీ సీటు వస్తుందా అంటే అది లేదు.

ఈయన ఒక్కరే కాదు.. మరో కీలక మహిళా నాయకురాలిది అదే కథ. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ తరుపున పోటీ చేసి..తర్వాత జనసేనలో చేరారు. పార్టీ పటిష్టం కోసం పాటు పడ్డారు. అలాగే పర్యావరణం కోసం పాటుపడే మరో ముఖ్య నేత కూడా జనసేనకు విశాఖలో పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే ఈ ముగ్గురు నేతలను అధినాయకత్వం పట్టించుకోవడం లేదని వారు నారాజ్ అవుతున్నారు.

దీంతో మాకెందుకొచ్చిన తంటా అని అద్దె కట్టడాన్ని ఆ కీలకనేత మానుకున్నాడు. ఇక ఇంటి ఓనర్ తెల్లారేసరికల్లా ‘టులెట్ బోర్డు’ పెట్టేశాడు. పార్టీని భుజాల మీద మోసిన నేతలను గుర్తించకుండా సీటు కోసం నిన్న, మొన్న చేరిన పరాయి పార్టీ వాళ్లను అందలం ఎక్కించడం ఏంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ ముగ్గురిని కాదని వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీని, అలాగే అనకాపల్లికి చెందిన మరో మాజీ మంత్రిని, వైసీపీ నుంచే వచ్చిన ఇంకో నేతకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జనసేన ‘పునాది’ నేతలను కలిచివేస్తోంది.

ఇదిలా ఉంటే నౌ ప్రసెంట్ విశాఖ లాంటి నగరంలో జనసేనకు పార్టీ ఆఫీస్ అంటూ లేకపోవడం.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బ్రాండ్ వాల్యూను తెలియజేస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. విశాఖలోనే కాదు ఏపీ అంతటా జనసేనకు టులెట్ బోర్డులు ఖాయమంటూ దెప్పిపొడుస్తున్నారు.

ఇదంతా పైనుంచి గమనిస్తున్న హైకమాండ్..  పార్టీ ఆఫీస్ ను కొత్తగా ఓపెన్ చేసి ఆ భారమేదో మోయండని వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి ఆదేశాలు ఇచ్చేసిందట. ఈ టులెట్ బోర్డు కథ ద్వారా తెలిసిందేంటంటే..అవసరానికి వచ్చే వలస నేతలను ఆకాశానికి ఎక్కిస్తే అపత్కాలంలో అండగా ఉండే బేస్ మెంట్  బద్దలు అవుతుంది. ఈ విషయాలను జనసేనాని మాత్రమే కాదు ఏ పార్టీ అధినేతలైనా గుర్తుంచుకుంటే మంచిది సుమా.

TAGS