Bharat Ratna : ‘భారతరత్న’కు వీరూ అర్హులే కదా? వీరికెందుకు ఇవ్వరు?

Are they worthy of 'Bharat Ratna'?

Bharat Ratna Awards, Sr NTR and Manmohan Singh

Bharat Ratna : భారతరత్న అవార్డు దేశంలోనే ప్రథమ పౌరపురస్కారం..వివిధ రంగాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వారికి, దేశ సేవకై తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వారికి అందజేస్తారనేది తెలిసిందే. భారతరత్న అందుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అది మహోన్నతులకు మాత్రమే సాధ్యమవుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది.

పూర్వ ప్రధానులు పీవీ నరసింహరావు, చరణ్ సింగ్ , వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, అద్వానీలకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించడం విశేషం.

తెలుగు జాతికి గర్వకారణమైన పీవీకి భారతరత్న ప్రకటించడంపై తెలుగు నేల పులకించిపోతోంది. ఆయనకు అవార్డు రావడంపై అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు తెలుగు ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దేశం నేడు ఈ స్థాయిలో ఉండడానికి సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కు కూడా భారతరత్న ప్రకటించాలని కోరుతున్నారు.

ఎన్టీఆర్ సినీ నటుడిగా కోట్లాది ప్రజలను అలరించడమే కాదు.. ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేశారు. అంతకుముందు 30 ఏండ్లుగా ఏలుతూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపారు. తెలుగు దేశం పార్టీ స్థాపనతో అప్పటిదాక వెలుగులోకి రాని బడుగు, బలహీనవర్గాలు రాజకీయాల్లోకి వచ్చాయి. అలాగే రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం, జనతా బట్టలు..ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు అద్యుడు ఆయనే.

ఇక మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేండ్లు పనిచేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ గా, పీవీ ప్రధాని హయాంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణలకు పునాది వేశారు. 1991 సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్. ఆయన వేసిన పునాదుల మీదే ప్రస్తుత భారత్ కొత్తపథంలో దూసుకెళ్లుతోంది. ఆయన హయాంలోనే దేశంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు.

దేశం గర్వించదగ్గ ఈ ఇరువురు నేతలకు కూడా భారతరత్నకు అర్హులని, కేంద్రం వీరిని పరిగణలోకి తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కోణంలో కాకుండా వీరు చేసిన ప్రజాసేవను గుర్తించాలని కోరుతున్నారు.

TAGS