PM Modi : మావోడు చేసిందే అభివృద్ధి.. మోదీ దేశానికి ఏం చేశాడు? పిచ్చి ముదిరిపోతోంది..
PM Modi : మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలంటే ఓ పిచ్చి. ఆ నేతలంటే మరీ పిచ్చి..ఈనేతలు ఏం చేసినా కరెక్ట్..ఇతరులు చేసింది మాత్రం తప్పు. ప్రజాసేవలో తమ నాయకుడే గొప్ప.. రాష్ట్ర అభివృద్ధి అంతా మా నాయకుడి చలువే అంటూ కితాబులు ఇస్తుంటారు వారి అభిమానులు, కార్యకర్తలు. తమ నేతనే అన్నీ చేశాడంటారు..ఇతరులు చేసిందేమి లేదంటారు. వీరి పక్షపాత పైత్యం తాజాగా మరింత పీక్స్ లోకి వెళ్లిపోతోంది.
తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్సే అంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు నమ్మరు.. తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వాళ్లు ఒప్పుకోరు. ఇక ఏపీ అభివృద్ధి చంద్రబాబు చలువే అంటే వైసీపీ కార్యకర్తలు ససేమిరా అంటారు. ఏపీ అభివృద్ధిని గాడిన పెట్టింది జగనే అంటే టీడీపీ వాళ్లు ఒప్పుకోరు. ఇక వీళ్లలో వీళ్లు అరుచుకుంటూ, పొట్లాడుకుంటూ పనిలో పనిగా దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారని కామెంట్లు విసురుతుంటారు. పదేళ్ల మోదీ పాలనలో భారత్ మరింత వెనక్కి వెళ్లిందని ఆరోపిస్తుంటారు.
అయితే అభివృద్ధి జరిగింది అనడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని చెప్పడానికి నిదర్శనాలు రాజకీయ నాయకుల మాటలు కాదు. వాటికి గణాంకాలు, కొలమానాలు ఉంటాయి. వీటిని కొన్ని దేశస్థాయిలో చేస్తే, మరికొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు చేస్తుంటాయి. అసలు ప్రధాని మోదీ దేశానికి అభివృద్ధి చేశాడా? లేదా? ప్రజల బతుకులు బాగుపడ్డాయా? లేదా? అనేదానికి గణాంకాలు ఉన్నాయని, వాటి ద్వారానే ఆయన ఏం చేశాడనేది తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వాటి ప్రకారం..2014 లో దేశ బడ్జెట్ 14 లక్షల కోట్లు.. ఇప్పుడు 44లక్షలకు పైబడి ఉంది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. అలాగే తలసరి ఆదాయం భారీగానే పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో యూపీఏ హయాంలో రూ.1,57,000 కోట్లు కేటాయిస్తే పదేళ్ల మోదీ పాలనలో రూ.46,30,000 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఆదాయం 13లక్షల కోట్లు, ఇప్పుడు 270లక్షల కోట్లుగా ఉంది. విదేశీ మారక నిల్వలు యూపీఏ హయాంలో 225 బిలియన్ డాలర్లు ఉంటే మోదీ పాలనలో ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లు. యూపీఏ హయాంలో జీడీపీ ర్యాంకు 10, మోదీ పాలనలో ఇప్పుడు 5. నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ) రాక అప్పట్లో 11శాతం, ఇప్పుడు 1 శాతం.
పై లెక్కలన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది మోదీ దేశానికి ఏం చేశాడన్నది. ఏ ప్రభుత్వ పనితీరునైనా చెప్పేది గణాంకాలే. ఇవన్నీ తెలియకుండా జనాల్లోకి వెళ్లి మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా మన నేతలు మాట్లాడుతుంటారు. మన నేతల తీరు ఎలా ఉంటుందంటే చేసేవాడిని చేయనివ్వక.. వెనక్కి గుంజే టైపన్న మాట. ఏం మాట్లాడినా రాజకీయమే తప్ప వేరే పనుండదు. అధికార యావే తప్పా దేశ ప్రజల బాగు వీళ్లకు అవసరముండదు.