Australian Senator : ఆస్ట్రేలియాలో అద్భుతం..పార్లమెంట్ సాక్షిగా తొలిసారి భగవద్గీతపై సెనేటర్ ప్రమాణం..

Miracle in Australia

Miracle in Australia

Australian Senator : ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అని మన గురజాడ ఏనాడో చెప్పారు. వివిధ సందర్భాల్లో ఎంతోమంది ఆయన మాటలను నిజం చేస్తున్నారు. తాజాగా తొలిసారిగా ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో కొత్త సెనేటర్ గా ఆయన ఎంపికై.. భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి సెనేటర్ గా నిలిచారు. ఆయన లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆరోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేయబోతున్న సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అభినందనలు తెలిపారు. అలాగే విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్ కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ అంటూ పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లేబర్ పార్టీ ఘోష్ ను ఎంపిక చేసింది. ఫ్రాన్సిస్ బర్ట్ చాంబర్స్ లో న్యాయవాది అయిన 38 ఏళ్ల ఘోష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘నాణ్యమైన విద్య, శిక్షణ ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండాలని గట్టిగా నమ్ముతున్నాను. ఇందుకోసం శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు.

వరుణ్ ఘోష్ ఎవరంటే..

ఈయన భారతీయ -అమెరికా బారిస్టర్. అతడు 17 సంవత్సరాల వయస్సులో లేబర్ పార్టీలో చేరాడు. లేబర్ రైట్ ఫ్యాక్షన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఘోష్ తల్లిదండ్రులు 1997లో భారత్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కు వచ్చారు. వారు  న్యూరాలజిస్టులుగా పనిచేస్తున్నారు. ఘోష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో కళలు, న్యాయవిద్యను అభ్యసించారు. తర్వాత లా స్కాలర్ షిప్ పై కేంబ్రిడ్జిలోని డార్విన్ కాలేజీలో చదివారు.

ఆ తర్వాత అంతర్జాతీయ న్యాయ సంస్థలలో పనిచేశారు. వెస్ట్రన్ యూనివర్సిటీ న్యాయశాస్త్రంలో అనుబంధ లెక్చరర్ గా కూడా పనిచేశారు. 2018లో ప్రాన్సిస్ బర్ట్ చాంబర్స్ లో ప్రైవేట్ ప్రాక్టీస్ లో బారిస్టర్ గా పనిచేయడం ప్రారంభించారు. కాగా, ఆయన్ను ఫిబ్రవరి 1న పశ్చిమ ఆస్ట్రేలియా సెనేటర్ గా నియమించగా నేడు ప్రమాణం చేశారు.

TAGS