AP Budget 2024 : ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ప్రత్యేకతలు ఇవే..ఆ మూడు బిల్లులు సైతం..

AP Budget 2024

AP Budget 2024

AP Budget 2024 : మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో  వైసీపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిన్న ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. నేడు ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది.

జూన్ వరకు ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం పొందనుంది. ఈ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఏవిధంగా ఉండబోతోంది? ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అని రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఉంది.

ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు ఏవి ఉండవని తెలుస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద 95వేల కోట్ల నుంచి 96 వేల కోట్ల వరకు బడ్జెట్ ను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అలాగే సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ ను శాసనసభలో మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెడుతారు. ఉదయం 11గంటల 3 నిమిషాలకు ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతారు. కేవలం నాలుగు నెలల వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ కనుక ఇందులో ఏ ప్రత్యేకతలు ఉండవని అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బడ్జెట్ లో అంచనాల కంటే తక్కువగానే ఖర్చు చేస్తోంది. 2019-20లో 76శాతం, 2020-21లో 83శాతం, 2021-22, 2022-23 సంవత్సరాల్లో 83శాతం, 2023-24లో 93శాతం ఖర్చు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. సహజంగా ప్రభుత్వం ఏదైనా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఖర్చు పెట్టలేవు.

ఈ రోజు సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్జేయూకేటీ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్ బిల్లు-2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనలైజేషన్ సంబంధిత సవరణ బిల్లు-2024లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

TAGS