Congress : బీఆర్ఎస్ ను కాంగ్రెస్ దెబ్బ కొట్టబోతోందా?
Congress : ఏ చెరువు నిండితో అందులోకి పక్షులు వలస వెళ్తుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టడం మామూలే. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం కలిగిస్తోంది. అధికారిక కార్యక్రమాల కోసమే కలిశానని చెబుతున్నా బీఆర్ఎస్ నేతల్లో భయం మాత్రం పోవడం లేదు.
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ జెండాలు ఎగురుతుండగా జీహెచ్ఎంసీలో సైతం దాని జెండా ఎగరాలని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం సాగుతోంది. మెదక్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో బీఆర్ఎస్ లో వణుకు పుడుతోంది. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందోననే భయం పట్టుకుంది.
నలుగురు ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గాల డెవలప్ మెంట్ కోసమే కలిశామని చెబుతున్నారు. కానీ లోపల విషయం వేరే అని అందరిలో అనుమానలు రేకెత్తుతున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 58, బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్ కు ఇద్దరే కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రయత్నిస్తోంది. ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా కౌన్సిలర్లు మారడంతో మున్సిపాలిటీలు మెల్లగా కాంగ్రెస్ వశం అవుతున్నాయి. మేయర్ తో సహా 28 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే కాంగ్రెస్ వారిని ఆకర్షించింది. అదే సూత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పాటిస్తోంది. నీవు చెప్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకోవాలని భావిస్తోంది. బీఆర్ఎస్ కుంభస్థలాన్ని కొట్టి దాని బలం తగ్గించాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 18 మన్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది.