Sujana Chowdary : ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సుజనా చౌదరి
Sujana Chowdary : రాజ్యసభ మాజీ ఎంపీ సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఉండటంతో ఈ సీటు ఎవరికి వెళ్తుందో తెలియడం లేదు. టీడీపీ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా పార్టీ మారి టీడీపీ టికెట్ పై పోటీచేయాలని అనుకుంటున్నారు.
సుజనా చౌదరికి టీడీపీతో కూడా మంచి సంబంధాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. బాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ ఓటమితో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి సంబంధాలు సరిగా లేకపోయినా లోకేష్ తో సమన్వయం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతోనే వచ్చే ఎన్నికల్లో విజయవాడ టికెట్ తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
అమరావతి విషయంలో సుజనా చౌదరి బీజేపీలో ఉన్నా మద్దతుగా నిలిచారు. సామాజికపరంగా విజయవాడ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరే అంశంపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. పార్టీ ఓడిపోయిన తరువాత వెళ్లిపోయి ఇప్పుడు రావడం అనుకున్నంత ఈజీ కాదు. విజయవాడ పార్లమెంట్ సీటు కోసం చాలా రోజులుగా కేశినేని చిన్ని కూడా ట్రై చేస్తున్నారు. లోకేష్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయవాడ పెద్ద సెంటర్ కావడంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈనేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీకి చాలా మంది క్యూలో ఉన్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఈక్రమంలో బెజవాడ సీటు కోసం పోటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఎన్నికల వరకు ఇంకా ఎంతమంది పోటీకి దిగుతారో అర్థం కావడంలేదు.