Undavalli Analysis : ఏపీలో ఎవరిని గెలిపించాలో జనాలకు తెలుసు..ఉండవల్లి మార్క్ విశ్లేషణ
Undavalli Arun Kumar : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది. పలువురు సీనియర్లు కూడా తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించుకోవాలనేది ప్రజలకు బాగా తెలుసని ఉండవల్లి తేల్చిచెప్పారు. ఓటర్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారన్నారు. పట్టణ ఓటర్లలో వైసీపీపై కొంత వ్యతిరేకత ఉన్న మాజ నిజమేనన్నారు. దీనికి గల కారణాలను వివరించారు. రోడ్లు బాగు చేయలేదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయిందన్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలో చదువుకున్న వారు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వైసీపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయని చెప్పారు.
రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారనే నమ్మకంతో ఉన్నారు. వాళ్లందరూ తమకే ఓటు వేస్తారని వైసీపీ నమ్ముతోందన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసిన ప్రభుత్వం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు.
వైఎస్ జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. అందుకే ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే నిర్ణయానికొచ్చారన్నారు. జగన్ కాకుండా ఏ పవన్ కల్యాణో సీఎం అయితే ప్రజలు నమ్మకం ఉంచేవారేమో కానీ చంద్రబాబు వస్తే మాత్రం కచ్చితంగా రద్దు చేస్తాడని భావిస్తున్నారన్నారు.
తాను అధికారంలోకి వస్తే వైసీపీ కంటే ఎక్కువగా డబ్బులు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని కూడా జనాలు నమ్మడం లేదన్నారు. ఉచితాల వాళ్ల ఏపీ దివాళా తీసిందని చెప్పిన చంద్రబాబే వైసీపీ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెబుతుండడంతో జనాల నమ్మకాన్ని ఆయన కోల్పోయారన్నారు. ఇక 175 సీట్లలో గెలుపునకు జగన్ బాధ్యుడని అన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ కు ఉన్న ధైర్యం ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు.