Telangana Employees : హమ్మయ్య! తెలంగాణ ఉద్యోగుల సంతోషం..కారణమిదే!

Telangana Employees

Telangana Employees

Telangana Employees : గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియదు. ఠంఛన్ గా 1వ తారీఖు పడాల్సిన జీతాలను ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ఉద్యోగుల అకౌంట్లలో జమ చేస్తూ 15-20వ తారీఖుల వరకు వేసేది. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడేవారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం 1వ తారీఖునే పడాలి. చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా 1వ తారీఖునే జీతాలు ఇస్తాయి. అదేమీ ఉచితంగా ఇచ్చేది కాదు. నెలంతా ఉద్యోగులు చాకిరి చేస్తే ఇచ్చేది.  నెల రోజులు పనిచేసిన డబ్బులు 1వ తారీఖున ఇస్తే వారి అవసరాలకు వాడుకుంటారు.

అయితే గత ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తమ కారు, బైక్, ఇంటి లోన్లు, తదితర ఈఎంఐలు, చిట్టీలు, అప్పులకు వడ్డీలు.. ఫీజులు, బిల్లులు, చార్జీలు..ఇలా ఒకటేమిటి సంసారమే ఒక సాగరమన్నట్టుగా ఎన్నో చెల్లింపులు ఉంటాయి. ఒకటో తారీఖు జీతం పడితే వీటన్నంటినీ సమయానికి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు వేయకపోగా.. ఏ పదహేనో, ఇరువై తారీఖునో వేసేసరికి.. చాలా మంది ఉద్యోగులు అప్పులు చేయడమో, చేబదలు తీసుకోవడమో చేసేవారు. ఇలా ఈఎంఐలు కట్టడం ఆలస్యమయ్యే సరికి వీరికి సిబిల్ స్కోర్ పడిపోయిందని ఎంతో మంది ఉద్యోగులు ఆవేదన చెందేవారు. సిబిల్ స్కోర్ పడిపోతే బ్యాంకు రుణాలు తీసుకోవడం చాలా కష్టమనే సంగతి తెలిసిందే.

దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తమను గెలిపించిన ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆ పార్టీ ఆకాంక్షలను నెరవేర్చాలని భావిస్తున్నది. ఇందులో ఉద్యోగులకు మొదటి అవసరం 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం. గత నెలలోనే దాదాపు చాలా మందికి 1వ తారీఖునే వేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో అందరికీ జీతాలు వేసింది. ఇక ఫిబ్రవరి నెలలో కూడా 1వ తారీఖునే జీతాలు పడ్డాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల జీతాలపై రేవంత్ పట్టుదలగా ఉన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అప్పుడే వారి కుటుంబాలు హ్యాపీగా ఉంటాయని, అందువల్ల ఉద్యోగి తన పనిని కూడా మనస్సు పెట్టి చేస్తాడని సూచించారు.  దీంతో 1వ తారీఖునే జీతాలు, పెన్షనర్స్ కు పింఛన్లు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతీ నెల వేతనాలు, పెన్షన్ల కింద నెలకు రూ.4539.79 కోట్లు చెల్లిస్తారు.

TAGS