CM Revanth : గద్దర్ కు..రేవంత్ ఇచ్చిన పెద్ద గౌరవం ఇదీ

great honor given by Revanth to Gaddar

great honor given by Revanth to Gaddar

CM Revanth : సినిమా రంగంలో ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిని నిలిపివేశారు. ఏ రంగంలోనైనా వారి సేవలు, వారి ప్రతిభను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తారు. ఇలా సినిమా రంగంలో కూడా ప్రతీ ఏడాది ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చేది. సినిమా నటులు వీటిని ఎంతో గొప్పగా భావించేవారు. తమ నటనకు కొలమానంగా వీటిని భద్రపరుచుకునేవారు. తమ కెరీర్ లో ఇన్ని నంది బహుమతులు సాధించామని చెప్పుకుని మురిసిపోయేవారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

నిన్న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమం నిర్వహించాక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున గద్దర్ పేరిట పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు ప్రభుత్వం తరుఫున ఇచ్చే నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ఇస్తామన్నారు. అవార్డు ఏర్పాటుకు త్వరలోనే జీవో తీసుకొస్తామన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన వ్యక్తి గద్దర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో గద్దర్ కీలక భూమిక పోషించారన్నారు.

ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలు తమకు స్ఫూర్తి అన్నారు. ఆయనతో మాట్లాడితే మాకు వెయ్యేనుగుల బలమన్నారు. ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని, అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడుతారని అన్నారు.

గద్దర్ అవార్డుపై కవులు, కళాకారులు, సినీ కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత ఈ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామమన్నారు. అద్భుత ప్రజా గాయకుడు, రచయిత అయిన, తెలంగాణ జాతి మరువలేని వ్యక్తి అయిన గద్దర్ పేరిట ఈ పురస్కారాలు ఇవ్వడం మరింత గొప్ప విషయమన్నారు. తన పుట్టుక నుంచి చావు వరకూ తెలంగాణ జాతి కోసం, సబ్బండ వర్గాల కోసం పనిచేసిన గద్దర్ కు ఇదే ఘన నివాళి అని అంటున్నారు. ఈ పురస్కారం ఇవ్వడంతో తరతరాలు గద్దర్ కీర్తి నిలిచి ఉంటుందన్నారు.

TAGS