Panjagutta PS : పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ.. రాష్ట్రంలోనే తొలిసారి ఇలా..అసలేం జరిగింది?
Panjagutta PS : హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకూ అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని సిటీ ఆర్డ్ డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని కూడా సమాచారం. దీంతో స్టేషన్ మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేశారు.
పంజాగుట్ట పీఎస్ కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. కాగా, ఇలా స్టేషన్ మొత్తాన్ని ఒకే సారి బదిలీ చేయడం ఇదే తొలిసారని పేర్కొంటున్నారు.