IPL 2024 : కంగారూలను చుచ్చు పోయించిన ఆటగాడి కోసం పోటాపోటీ.. ఏ జట్టుకు చిక్కేనో?
IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్ ను మరింత ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే అన్ని జట్లూ మినీ వేలంలో కోట్ల రూపాయలు వెచ్చించి స్టార్ క్రికెటర్లను తీసుకున్నాయి. వీరంతా అంచనాలకు తగ్గట్టుగా ఆడితే ఈ మెగా టోర్నీ అభిమానులకు అసలైన క్రికెట్ విందు పంచడం ఖాయం. అయితే వీరందరి కంటే తాజాగా ఎలాంటి అంచనాల్లేకుండా జాతీయ జట్టు తరుపున సంచలనాలు రేపుతున్న ఓ క్రికెటర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా నిలుస్తున్నాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన పేస్ బౌలింగ్ తో కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్ గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని జట్లూ చర్చించుకుంటున్నాయి. తమ జట్టులో ఇలాంటి బౌలర్ ఒకరు ఉండాలని కోరుకుంటున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ కూడా జోసెఫ్ లాంటి బౌలర్ ను కోరుకుంటున్నాయి.
అయితే ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం పూర్తికావడం, దాదాపు ఈసారి ఐపీఎల్ లో ఆడే జట్లను ఖరారు చేసుకోవడం కూడా పూర్తయినా షమార్ జోసెఫ్ ను తమ జట్టులోకి ఎలాగైనా తీసుకోవాలని మూడు జట్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. కంగారూలను వణికించి పీడకలగా మారిపోయిన షమార్ జోసెఫ్ ను తమ జట్టులోకి వస్తే ఈసారి టోర్నీ తమదే అనే ధీమాలో ఉన్నాయి.
ఆర్సీబీ ఇప్పటికే విండీస్ పేసర్ అల్గారీ జోసెఫ్ ను తీసుకుంది. అయినా పేసర్లకు అనుకూలించే హోమ్ పిచ్ చిన్నస్వామి స్టేడియంలో షమార్ జోసెఫ్ వంటి పేసర్ అవసరమని భావిస్తోంది. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తెచ్చుకున్నా కోల్ కతా నైట్ రైడర్స్ షమార్ జోసెఫ్ తమ జట్టులో ఉండాలని అనుకుంటోంది. ఇప్పటికే ఉన్న స్టార్ బౌలర్లకు షమార్ తోడైతే తనకు తిరుగుండదు అని భావిస్తోంది.