Na Potta Na Istam : ఈ హోటల్ కు వెళ్తే ‘నా పొట్ట నా ఇష్టం’ అని ఎంతైనా తినేస్తారు..!
Na Potta Na Istam Hotel : చాలా మంది విద్యార్థులకు విదేశాల్లో జాబ్ చేయడమనేది ఓ కల. దాని కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. అమెరికాలో స్థిరపడుతా..కెనడాలో స్థిరపడుతా..అని గొప్పలు చెప్పుకుంటుంటారు. ఏదో కొద్ది మంది తప్పితే మిగతా అందరూ అక్కడ ఏ చాకిరి చేస్తారో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. విదేశాల నుంచి చాలా మంది భారతీయ యువత మళ్లీ ఇండియా వైపు చూస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేయడం కన్నా మనవాళ్ల మధ్య వ్యవసాయమో, బిజినెస్ చేయడానికో ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వారికున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా బిజినెస్ ను ప్రమోట్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తమ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు.
ఓ యువకుడు జర్మనీలో ఉద్యోగం వదిలేసి కరీంనగర్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ‘నా పొట్ట నా ఇష్టం’ పేరుతో హోటల్ ప్రారంభించాడు. హోటల్ పేరు చూస్తేనే నవ్వొస్తుంది కదా. ఈ హోటల్ పేరుతో ఎన్నో మీమ్స్, కార్టూన్స్ కూడా వచ్చాయిలెండి. ఇక ఈ హోటల్ కు వెళ్తే తినకుండా ఉండలేరు కూడా. ఇప్పటి యువత అంతా కొత్తగా ఆలోచిస్తోంది అని చెప్పడానికి ఈ యువకుడే నిదర్శనం.
కష్టమర్లను ఆకట్టుకోవడానికి విదేశీ పేర్ల కంటే అచ్చమైన తెలుగు భాషను వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. హోటలైనా, షాపైనా సంప్రదాయ తెలుగు పేర్లను, మరీ ముఖ్యంగా ఆకట్టుకునేందుకు వింతైన పేర్లను పెడుతున్నారు. వ్యాపారంలో రాణించాలంటే మిగతా వారి కంటే వెరైటీ చూపిస్తేనే కస్టమర్లు తమను గుర్తిస్తారని ఇలా చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో ప్రారంభమైన ఈ హోటల్ పేరును చూసి నవ్వని వారు లేరు.
కరీంనగర్ కు చెందిన అజయ్ అనే వ్యక్తి లండన్ లో చదువుకుని జర్మనీలో ట్రాన్స్ లెట్ గా కూడా ఉద్యోగం చేశాడు. ఎక్కడో విదేశాల్లో బతకడం కంటే మన వాళ్ల మధ్య ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చి ‘నా పొట్ట నా ఇష్టం’ అనే పేరుతో హోటల్ ప్రారంభించాడు. స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, అలాగే ఫ్రూట్ జ్యూస్, కాక్ టైల్స్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. తర్వాత మీల్స్ కూడా పెడుతామని ఓనర్ అజయ్ చెపుతున్నారు.
తమ హోటల్ కు ‘ఓన్ బ్రాండ్’ అని ట్రేడ్ లైసెన్స్ సైతం ఉందని.. ఎవరికైనా బ్రాంచి కావాల్సి వస్తే తమను సంప్రదించాలని తెలిపారు. ప్రజల్లోకి తమ హోటల్ పేరు తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామని అంటున్నారు. ఈ హోటల్ లో టేస్ట్, క్వాలిటీ అదుర్స్ అని కస్టమర్లు అంటున్నారు. ఈ హోటల్ పేరుకు తగ్గట్టే ఇక్కడికి వెళ్లిన కస్టమర్లు ‘నా పొట్ట నా ఇష్టం’’ అని ఏదైనా తినేస్తారని చెబుతున్నారు. ఇప్పుడీ మౌత్ పబ్లిసిటీతోనే ఈ హోటల్ కు జనాలు క్యూ కడుతున్నారు.