Nitish Kumar : దేశంలో ఇలాంటి సీఎం ఎవరూ ఉండరు..నితీశ్ కుమార్ రాజకీయమే వేరు..
Nitish Kumar : దేశంలో ఆయన లాంటి వ్యూహాలు ఎవరూ చేయరు. అలవోకగా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు. ప్రత్యర్థి పార్టీలతో ఏ సంకోచం లేకుండా మద్దతు తీసుకుంటారు. ఆయన టార్గెట్ ఎప్పటికీ సీఎం పదవిలో ఉండడమే. దేశంలోనే ఇలాంటి నేత ఎవరూ ఉండరేమో. అందుకే 9వ సారి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్ లో గత ఇరువై ఏండ్లుగా నితీశ్ రాజకీయాలే నడుస్తున్నాయి. ఆయన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోని పార్టీ లేదు. సీఎం పదవి కోసం ఏ పార్టీ కొమ్ముకాయమన్నా కాస్తారు. అలా ఆయన 9వ సారి సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు ఝలక్ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీజేపీతో దోస్తీ కట్టారు.
ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే వందల కోట్లు వెనకేసుకుంటారు. మరి పదహేను సంవత్సరాలకు పైబడి నితీశ్ కుమార్ బిహార్ సీఎంగా ఉన్నారు. మరి ఆయన సంపాదన ఎంతుంటుందో అనే చర్చ బయలుదేరింది. రాజకీయంగా తరచు మిత్రులను మారస్తూ, ఈజీగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే నితీశ్ ను ఆస్తులపై ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే ఆయన ఆస్తుల చిట్టా అలా ఉంటుంది.
రీసెంట్ గా బిహార్ ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తాజా ఆస్తి వివరాలను చూస్తే మీకే అర్థమవుతుంది. సీఎం నితీశ్ కుమార్ 1 కోటి 64 లక్షల రూపాయల విలువైన చర, స్థిరాస్తులను కలిగి ఉన్నారు. నితీశ్ చేతిలో రూ.22,552 నగదు ఉండగా.. 48 వేల రూపాయలు మూడు వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడి ఉన్నాయి.
నితీశ్ కుమార్ మొత్తం చరాస్తులు రూ.16లక్షల 84వేలు. ఇందులో రూ.11.32 లక్షల విలువైన ఫోర్డ్ కారు ఉంది. ఢిల్లీలోని ద్వారకలో ఆయనకు 1000చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది. నితీశ్ కుమార్ 2004లో ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. అప్పుడు దాని విలువ రూ.13.78లక్షలు. ప్రస్తుతం దాని విలువ రూ.1.48 కోట్లు. సీఎం సతీశ్ కు 13 ఆవులు, పది కోడెలు ఉన్నాయి.