RK Roja : నగరి నుంచి రోజా ఔట్.. ఎంపీగా పోటీ చేయనున్నారా?

Roja out of Nagari

Roja out of Nagari

RK Roja : సీఎం జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 60 మంది అభ్యర్థుల స్థానాలు మార్చిన జగన్.. తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఎంపీ జాబితా దాదాపుగా పూర్తయింది. మాజీ మంత్రి రోజాపై సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఆ స్థానం నుంచి రోజాను మార్చి పార్లమెంట్ బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.

కీలక మార్పులు
అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతిస్తున్నారు. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి దాదాపు సీటు లేదని తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని మాగుంటకు సీటు దక్కేలా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో సీట్ల మార్పుపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు వినిపించింది. దీనిపై జిల్లా నేతల నుంచి సానుకూలత కనిపించ లేదు. దీంతో, ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషించారు. ఈ సమయంలోనే నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా పేరు తెరమీదకు వచ్చింది.

ఎంపీగా బరిలో రోజా : ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో, చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒక్కో కుటుంబంలో రెండు సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. రోజా అభ్యర్దిత్వం పైన జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి చర్చించారు.

ఇక, అందరిలో సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. బూచేపల్లి, బాలినేని వంటి నేతలు మరోసారి జగన్ వద్దకు వెళ్లి సీటు కేటాయింపుపై చర్చించాలని భావిస్తున్నారు. దీనిపై సాయిరెడ్డితో చర్చించిన సమయంలో రోజా పేరును పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై రోజాతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. దీంతో నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి రోజా పేర్లు ఖరారుపై సీఎం జగన్ సోమవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తుంది.

ఇక, రోజాను నగరి నుంచి మారిస్తే ఆ స్థానంలో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆలస్యం చేయకుండా వెంటనే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని అధినేత జగన్ భావిస్తున్నారట. దీంతో, జిల్లా నేతల అభ్యర్థనలతో ఒంగోలు సీటు మాగుంటకు ఇస్తారా..? రోజాను బరిలోకి దించుతారా? అనేదానిపై క్లారిటీ రానుంది.

TAGS