Dalit Leaders : వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తికి దళిత నేతలే కారణమా? ఇంత పక్షపాతమెందుకు?

Dalit Leaders

Dalit Leaders Vs CM Jagan

Dalit Leaders : వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను జగన్ మార్చేశారు. వీరిలో దళిత నేతలే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత నిందను జగన్ రెడ్డి తమపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్సీ నేతలు వాపోతున్నారు. మొదటి లిస్ట్ లో ఇద్దరు ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యేకు స్థానచలనం కల్పించారు. ఎర్రగొండ పాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేశ్ ను కొండేపి నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు.

ఆ స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. ఒకటీ రెండు ఘటనలు మినహా ఆదిమూలపు సురేశ్ కూడా అధిష్ఠానం మెప్పు పొందలేకపోయారు. అసెంబ్లీలో టీడీపీపై ఘాటు విమర్శలు చేసే నాగార్జునకు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో ఆయన సీటు మార్చేశారనే చర్చ సాగుతోంది.

రెండో విడత జాబితాను పరిశీలిస్తే.. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు అవకాశం కల్పించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వైపు మొగ్గు చూపని వైసీపీ హైకమాండ్ ఆ స్థానంలో కంబాల జోగులను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యింది.

మూడో లిస్ట్ లోనూ చాలా మార్పులే చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్ నిరాకరించిన అధిష్ఠానం.. ఆ స్థానంలో కంభం విజయరాజుకు చాన్స్ ఇచ్చింది. పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ గా ఉన్న ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపిన జగన్.. ఆయన స్థానంలో మూతిరేవుల సునీల్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేయడంపై ఎంఎస్ బాబు వైసీపీ హైకమాండ్ ను తప్పుబట్టారు.

కోడుమూరు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ కు టికెట్ ఇవ్వని వైసీపీ అధిష్ఠానం.. అక్కడ నుంచి డాక్టర్ సతీశ్ ను ఎంపిక చేసింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ స్థానంలో మేరిగ మురళిని పోటీ చేయిస్తోంది. తొలి నుంచి జగన్ కు అండగా నిలిచిన వరప్రసాద్ కు కూడా టికెట్ నిరాకరించడం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు ఈసారి నిరాశే ఎదురైంది. ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం ఆసక్తి చూపలేదు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉనన మద్దిల గురుమూర్తికి అవకాశం కల్పించారు. తిరుపతి ఎంపీ సీటును ఆదిమూలంకు కేటాయించారు. ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయంతో లోక్ సభకు ఆదిమూలం సిద్ధమయ్యారు.

ఇక నాలుగో విడత జాబితాలోనూ పలు మార్పులు చవిచూశాయి. అందులో కూడా ఎస్సీ నేతలకే స్థాన చలనం కల్పించారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ ను కొనసాగించేందుకు ఇష్టపడని జగన్. .ఆ స్థానంలో డాక్టర్ సుధీర్ కు చాన్స్ ఇచ్చారు. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిపై శీతకన్ను వేసిన వైసీపీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చింది.

ఏపీలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 21 మందిని మార్చిన వైసీపీ నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరికి స్థాన చలనం కల్పించింది. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను దళిత ఎమ్మెల్యేలపై రుద్దడమే అంటున్నారు. మరి జగన్ సామాజిక వర్గానికి చెందిన ఎంత మంది నేతలను మార్చారనే ప్రశ్నలు ఆయా వర్గాల్లో తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి పేరు వస్తే ఓ వర్గానికి ఆపాదించడం.. చెడ్డపేరు వస్తే బహుజన వర్గాలపై రుద్దడం పాలకులకు అలవాటేననే విమర్శలు వస్తున్నాయి.

TAGS