Padma Awards 2024 : పద్మ అవార్డులు: పులకించిన తెలుగునేల..8మందికి అత్యున్నత పురస్కారం..
Padma Awards 2024 : ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజినీరింగ్..వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డులను ప్రకటించారు. వీరిలో 8 మంది తెలుగువారు ఉండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మవిభూషణ్, మిగతా 6గురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మశ్రీ అవార్డులు సాధించింది వీరే..
గడ్డం సమ్మయ్య:
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన సమ్మయ్య చిందు యక్షగానంలో పేరొందారు. అయిదు దశాబ్దాలుగా 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు సామాజిక అంశాలపై కూడా ప్రచారం చేస్తుంటారు.
దాసరి కొండప్ప:
నారాయణపేట జిల్లా దామరగిద్ద ఆయన స్వస్థలం. బుర్ర వీణ వాయిద్య కళాకారుడు. జ్ఞానతత్వానికి చెందిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు. బుర్రవీణకు వాయిస్తూ కథలు చెప్పే వారిలో ప్రస్తుతం కొండప్ప మాత్రమే ఉన్నారు. ఆయన బలగం సినిమాలో ‘అయ్యో శివుడా ఏమాయే’ అనే పాటను పాడారు.
కూరెళ్ల విఠాలాచార్య:
ఈయనది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి. తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5వేల పుస్తకాలతో పుస్తకభాండాగారాన్ని స్థాపించారు. ఈయన కృషిని గతంలో ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ లో ప్రశంసించారు.
ఆనందాచారి వేలు:
ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లి గ్రామవాసి. ఈయన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈయన శిల్పకళలో విశేష సేవలు అందించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన స్థపతిగా నియమించారు.
ఉమామహేశ్వరి:
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. ఈమే హరికథ గానంలో జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కేతావత్ సోమ్లాల్:
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తండాకు చెందిన వారు. సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలలపాటు అవిశ్రాంతంగా పనిచేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. ఈయన బంజారా ప్రజల చైతన్యం కోసం 200కు పైగా పాటలు రాశారు.