RK Resignation : ఆర్కే రాజీనామా లేఖ స్పీకర్ కు కనిపించలేదా..? రాజ్యాంగ పదవిలో ఉండి ఇదేం పక్షపాతం..!
Alla Ramakrishna Reddy : ఏపీలో ఉన్నంత పక్షపాత రాజకీయాలు ఎక్కడ ఉండవు అని అంతా అంటుంటారు. కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఉండి కూడా పార్టీల పక్షపాతం పాటించడం వంటి ఘటనలు చూసే అలా అని ఉంటారని అనిపిస్తోంది. మూడేళ్ల కింద రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ.. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే ముందు స్పీకర్ కు కనిపించింది. గంటా వివరణ ఏదీ కోరుకుండానే ఆమోదించేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన రాజీనామా మాత్రం స్పీకర్ కు కనిపించలేదు. ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించారు. కానీ స్పీకర్ ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఆళ్ల రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తారన్న నమ్మకంతోనే ఆయన రాజీనామా లేఖ జోలికి పోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
స్పీకర్ ఒక పార్టీకి చెందినప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంటే.. అన్నింటి విషయంలో ఓకేసారి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీలను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. గంటా రాజీనామాను ఆమోదించిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నిజానికి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అందుకే అనర్హతా అనే మాట రాదు. కానీ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు. వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికీ నోటీసులు జారీ చేశారు. కానీ వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం లేదు. స్పీకర్ పూర్తిగా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుంటూ.. విలువల్ని పూర్తిగా దిగజారుస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.