Sania Mirza : పెళ్లి, విడాకులు.. రెండూ కఠినమైనవే.. సానియా వేదాంత ధోరణి..
Sania Mirza : స్పోర్ట్స్ కపుల్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయారంటే గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తమ మాటలు, చేష్టల ద్వారా పరోక్షంగా వాటిని ఖండించుకుంటూ వచ్చారు. కానీ తాజాగా షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలు నిజమేనని అందరికీ తెలిసింది. ఇదిలా ఉండగానే.. రీసెంట్ గా సానియా తన ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టిన ఓ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు ఇందులోనే ఆమె పరోక్షంగా పేర్కొంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన వార్తలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను ఆయన తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆయనకు మూడో పెళ్లి అని తెలిసిందే. 2002లో అయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్న షోయబ్..2010లో ఆమెకు విడాకులు ఇచ్చారు. తర్వాత అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి బాగా పాపులర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత ఈ జంట దుబాయ్ లో స్థిరపడ్డారు. 2018లో వీరికి కొడుకు పుట్టాడు. అతడికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.
షోయబ్, సానియాది సుదీర్ఘ వివాహ బంధం. వీరు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒకరినొకరు బాగా ప్రోత్సహించుకునేవారు. బర్త్ డేలు, ఫ్యామిలీ ఈవెంట్లు, వెకేషన్స్..ఇలా అన్నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. గత రెండేళ్ల నుంచి వీరి వివాహ బంధంపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరు విడిపోయారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. వీటికితోడు షోయబ్ తన ట్విటర్ బయో నుంచి సానియా పేరు తొలగించడం, సానియా కూడా షోయబ్ తో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయినా కూడా ఈ జంట విడాకుల వార్తలను గత కొంతకాలంగా తోసిపుచ్చుకుంటూ వచ్చారు.
షోయబ్ మూడో పెళ్లికి ముందు సానియా తన ఇన్ స్టా స్టోరీస్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవ్వగలం’అనే అర్థం వచ్చేలా ఉన్న ఓ పాపులర్ కొటేషన్ ను పోస్ట్ చేసింది. అందులో ‘‘పెళ్లి కఠినమైనదే.. విడాకులూ కఠినమైనవే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి.. లావుగా ఉన్న కష్టమే.. అలాగని ఫిట్ గా మారడమూ కష్టమైన పనే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి.. అప్పు చేసిన కష్టమే.. అలాగని ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. మాట్లాడిన కష్టమే.. మాట్లాడకపోయినా కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి.. జీవితంలో ముందుకు సాగడం అంత సులభం కాదు.. ఈక్రమంలో మనం వేసే ప్రతీ అడుగూ కష్టమైనదే.. కానీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది.. ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే అంతగా సక్సెస్ కాగలుగుతాం. కాబట్టి తెలివిగా మీ మార్గాన్ని ఎంచుకోండి..’’ అని సుదీర్ఘంగా రాసుకొచ్చింది. దీన్ని బట్టి విడాకులు ఈ పోస్ట్ కు ముందే తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.