Fake Passports : కోరుట్ల కేంద్రంగా నకిలీ పాస్ పోర్టుల దందా?
Fake Passports : జగిత్యాల జిల్లా కోరుట్ల కేంద్రంగా నకిలీ పాస్ పోర్టుల దందా కొనసాగుతోంది. ఇక్కడ నుంచి విదేశీయులకు పలు పాస్ పోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. మన ఏజెంట్ల పుణ్యమాని శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి విదేశీయులకు ఇక్కడ నుంచి పాస్ పోర్టులు ఇప్పించిన ఘనత మనవారిదే. డబ్బులిస్తే ఎక్కడ నుంచైనా పాస్ పోర్టు సంపాదించొచ్చు. దీనికి కావాల్సిందల్లా మనీనే. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్లుగా నకిలీ పాస్ పోర్ట్ ల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది.
అశోక్ రావు, కమ్రుద్దీన్, చాంద్ పాషా లాంటి ఏజెంట్లు తమ ప్రాపకం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ ఉద్యోగులు కూడా వారితో కలిసి పోయి ప్రతి పనికి ఓ సెపరేట్ రేటు పెట్టుకున్నారు. దీంతో పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఈ దందా ఇలాగే కొనసాగింది. ప్రతి సారి దొరికి పోవడం తరువాత మెల్లగా సర్దుమణగడం మామూలే. ఈనేపథ్యంలో ప్రస్తుతం నకిలీ పాస్ పోర్టుల వ్వవహారం రచ్చగా మారింది.
పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా పలు కీలక పత్రాలు దొరికినట్లు సమాచారం. సీఐడీ అధికారులు తెల్లవార్లు దాడులు చేయడంతో ఇంకా పలు పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పాస్ పోర్టుల నకిలీ దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు చెబుతున్నారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.
పాస్ పోర్టు రావాలంటే చాలా వ్యవహారం ఉంటుంది. కానీ అడుగడుగునా వారికి అధికారుల అండదండలు ఉండటంతో క్షణాల్లో పాస్ పోర్టులు సులభంగా లభించడం విశేషం. ఈనేపథ్యంలో మరింత లోతుగా వెళ్తే బాగోతం బయటపడుతుందని అంటున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల రెండు జిల్లాల్లో దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది.
నకిలీ పాస్ పోర్టుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల నుంచి విదేశీయులకు పాస్ పోర్టులు మంజూరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా దందా చేపడుతున్నారు. ఇప్పుడు సీఐడీ అధికారుల సోదాలతో విషయం బయటకు వచ్చింది. ఇంకా లోతుగా విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు.