Most Powerful Army : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏదో తెలుసా? మరి మన పరిస్థితి ఏంటి?
Most Powerful Army : ప్రస్తుతం ప్రపంచ యుద్ధాలు, దాడులు, ప్రతీదాడులతో హోరెత్తిపోతోంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ వార్, మరో వైపు ఇజ్రాయెల్-హమాస్, ఇరాన్-పాకిస్తాన్ దాడులు, ప్రతీ దాడులు, ఆఫ్రికాలో జాతుల సంఘర్షణలు, నియంతలపై ప్రజల తిరుగుబాటులు..ఇలా నిత్యం ఏదో సంఘర్షణలు ఉంటూనే ఉన్నాయి. ఒక దేశం ప్రశాంత వాతావరణంలో ఉంటూ, ఆ దేశ పౌరులు తమ తమ విధుల్లో పాల్గొంటూ ఆ దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలంటే రక్షణ వ్యవస్థ చాలా కీలకం. ఎప్పుడూ ఏ దేశం దాడి చేస్తుందో.. ఎటు వైపు శత్రువు పొంచి ఉన్నాడో అనే భయాలతో ఉంటే దేశ ప్రగతి సాధ్యం కాదు. అలాగే ఆ దేశ పౌరులు సుఖసంతోషాలతో ఉండలేరు. ఒక దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు రక్షణ పకడ్బందీగా ఉంటేనే ఆ దేశం పురోగతి సాధ్యమవుతుంది.
పెద్ద దేశాలు చిన్న దేశాలపై దాడి చేయడం, వాటి భూభాగాలను ఆక్రమించడం మనం చూస్తూనే ఉన్నాం. చైనా..తన పొరుగున ఉన్న తైవాన్ పై కవ్వింపు చర్యలు మనకు కనపడుతూనే ఉన్నాయి. అలాగే ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికి రష్యా, పాలస్తీనాను ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్..ఇలా నిత్యం సవాలే. వీటన్నంటిని ఎదుర్కొవాలంటే ఆ దేశం మంచి రక్షణ వ్యవస్థ ఉండాలి. యుద్ధ పరికరాలు, యుద్ధ వాహనాలు, ఆధునాతన ఆయుధాలు, ఆధునాతన సాంకేతిక రక్షణ వ్యవస్థ ఉండాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. ఇలా త్రివిధ దళాలు బలంగా ఉండాలి. అందుకోసం భారీ ఎత్తున మానవ వనరులను వాడుకోవాలి. లక్షల కోట్ల నిధులు రక్షణకు కేటాయించాలి. అప్పుడే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది.
శక్తివంతమైన ఆర్మీని కలిగి ఉన్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలువడం విశేషం. దశాబ్దాలుగా ఆ దేశమే అగ్రస్థానంలో ఉంటుందన్నది తెలిసిందే. ఇక భూటాన్ దేశం చివరన ఉంది. ఈ విషయాలను ప్రపంచ రక్షణ సమాచారాన్ని పర్యవేక్షించే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్ సైట్ 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ దేశాల్లోని సైనిక శక్తిపై ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 145 దేశాల ర్యాంకులను ప్రకటించింది.
ఇందులో అగ్రస్థానంలో అమెరికా, రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యా, నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. మన దాయాది పాకిస్తాన్ 47వ స్థానంలో, బంగ్లాదేశ్ 43వ స్థానాల్లో నిలిచాయి. ఇంకా టాప్ టెన్ లో ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా, యూకే, జపాన్, తుర్కియే, ఇటలీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన రక్షణ వ్యవస్థ ఉన్న దేశంగా భూటాన్ నిలిచింది. దీంతో పాటు దిగువ స్థానాల్లో మాల్డోవా, సూరినామ్, సోమాలియా, లైబీరియా తదితర దేశాలు ఉన్నాయి.
ఈ ర్యాంకింగ్ లను సైనికుల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులతో పాటు మొత్తం 60 అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించింది. ఇక సైన్యానికి కేటాయించే బడ్జెట్ పరంగా చూస్తే అమెరికా అగ్రస్థానంలో ఉంది.