Chandrababu : ‘అమరావతి’ నిర్మాణంపై చంద్రబాబు అలా చేయాల్సింది కాదా?
Chandrababu : చంద్రబాబు దూరదృష్టి కలిగిన రాజకీయ నేత. హైదరాబాద్ లో ఐటీకి ఎక్కువ అవకాశం ఉంటుందని.. హైటెక్ సిటీ నిర్మాణానికి పూనుకున్నారు. అప్పుడే అందివస్తున్న సాంకేతికత.. తెలుగు నాట కష్టపడే స్వభావమున్న విద్యార్థులు ఉండడంతో.. టెక్నాలజీకి ఆయన పెద్దపీట వేశారు. కాలక్రమంలో వచ్చిన నేతలు కూడా ఐటీకి బాగా సపోర్ట్ చేయడంతో ప్రస్తుతం బెంగళూరుతో హైదరాబాద్ పోటీపడుతోంది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ రాకతో నగర రూపురేఖలే మారిపోయాయి. మిగతా రంగాలపై కూడా ఐటీ ప్రభావం పడింది. జనాలకు ఉపాధి పెరిగింది. క్రమంగా సైబరాబాద్ విస్తరించింది. దీంతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం వచ్చింది.
ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించగలడని నమ్మి గెలిపించారు. అమరావతిని రాజధానిగా ఆయన ప్రకటించారు. నగర నిర్మాణ బాధ్యతలు సింగపూర్ కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో చంద్రబాబు చేసిన పనిని కొంతమంది విశ్లేషకులు విభేదిస్తున్నారు. సింగపూర్ లో కట్టే నిర్మాణాలనే చైనా, మలేషియా కడుతుంటే.. ఆ దేశానికి అమరావతి నగర నిర్మాణ బాధ్యతలు ఎలా అప్పజెప్పారని అంటున్నారు.
ఆ బాధ్యతలను కూడా సింగపూర్ ప్రభుత్వం తీసుకోదని, మూడు ప్రైవేట్ కంపెనీలు, ఇండియాలోని మరో కంపెనీ చేపడుతాయని.. అలాంటి వారికి ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని ధారదత్తం చేసి..వాళ్లు టౌన్ షిప్ లు కడితే మనం కొనడమేంటని అంటున్నారు. 1691 ఎకరాలు ఇవ్వడం ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. మన భూమి వాళ్ల చేతిలో పెట్టి.. వాళ్లు ఫిక్స్ చేసే రేటుకు మనం కొనడమేంటని అంటున్నారు. ఈ అమ్మకాలను కూడా ఏదైనా ప్రభుత్వ అథారిటీ చేపడుతుందా అంటే అది లేదు.. అమరావతి మేనేజ్ మెంట్ సర్వీసెస్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడం ఎందుకని అంటున్నారు. ఇది కూడా సింగపూర్ కంపెనీ అని దీంతో మన ఏపీ ప్రజలకు ఒరిగేది ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కాగా, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నగర నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. తర్వాత జగన్ అధికారంలో రావడంతో అమరావతి పాత్రను తగ్గించి మూడు రాజధానులను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కొలిక్కే రాలేదు. అసలు ఎటు వెళ్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరుగనుండడంతో.. ఆ ఎన్నికల్లో గెలిచే పార్టీపై రాజధానుల విషయం ఆధారపడి ఉంటుంది. ఒక వేళ జగన్ మళ్లీ గెలిస్తే మూడు రాజధానుల విషయంలో సీరియస్ గా ముందుకెళ్తారు. అమరావతి నగర నిర్మాణ ఒప్పందాలను రద్దు చేసి.. విశాఖ నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక చంద్రబాబు గెలిస్తే మూడు రాజధానుల ఇష్యూకు ముగింపు పలికి.. అమరావతి నగర నిర్మాణానికి పూనుకుంటారు. అయితే ఈ నిర్మాణాన్ని సింగపూర్ వంటి దేశాలకు, ప్రైవేట్ కంపెనీలకు కాకుండా ఏపీకి చెందిన కంపెనీలు, లేదా ప్రభుత్వమే రాజధాని నగర నిర్మాణానికి పూనుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాజధాని లేక ఏపీ ప్రజలు అవమానాల పాలవుతున్నారని, ఇకనైనా అమరావతి నగర నిర్మాణం సమర్థవంతంగా, పారదర్శకంగా పూర్తిచేసి దేశంలోనే అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు.