KTR : చేతుల కాలాక..ఆకులు పట్టుకుంటే ఎలా కేటీఆర్?
KTR : తెలుగు నాట ‘‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు..’’ అనేది పాపులర్ సామెత. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాగా సూట్ అవుతుందనే చెప్పాలి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో గెలువడమే లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికీ ఏడు లోక్ సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి.
అన్ని సమీక్షల్లో మెజార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు వ్యవహార శైలినే తప్పుపట్టడం గమనార్హం. కేసీఆర్ పదేండ్ల పాలనలో పెరిగిపోయిన అవినీతి, అరాచకాలను ప్రస్తావించారు. జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతను గుర్తించడంలో పాలకులు దారుణంగా విఫలమైనట్టు సమీక్షలో వారు ఆరోపించారు.
జనాల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉన్న సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇవ్వడం కొంపముంచిందని ప్రతీ ఒక్కరూ తప్పుపడుతున్నారు. దీంతో నేతల ఆరోపణలు, వ్యాఖ్యలను ఖండించే అవకాశం కేటీఆర్ కు దొరకడం లేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గ సమీక్షలో చూసినా అందరూ హైకమాండ్ నే తప్పుపట్టడంతో.. ఇక కేటీఆర్ కూడా వాళ్ల ఆరోపణలను అంగీకరించక తప్పట్లేదు. పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని ప్రకటించారు. పదేండ్లలో పాలనపై దృష్టి సారించామని, పార్టీని, ద్వితీయ శ్రేణి నాయకులను, క్యాడర్ ను పట్టించుకోలేదని కేటీఆర్ అంగీకరించారు.
ఇక పథకాల పరంగా దళితబంధు బాగా నష్టపరిచినట్టు అందరూ ఆరోపించారు. దళితబంధు ఏదో కొద్ది మందికి అంది.. మిగతా వాళ్లకు అందకపోవడంతో వారిలో ఆగ్రహానికి కారణమైందన్నారు. అలాగే ఇతర సామాజికవర్గాలకు ఎలాంటి సాయం అందకపోవడంతో వారిలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమీక్షలో నాయకులు ఆరోపించారు. రైతుబంధు పథకం కూడా భూస్వాములకు ఇవ్వడం, అర్హులైన పేదల భూములకు ధరణి పేరు చెప్పి పట్టాలు ఇవ్వకపోవడంతో రైతుల్లోనూ ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమయ్యాయన్నారు. కాళేశ్వరం పథకం విఫలం కావడం, ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యం వహించడంపై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని తెలిపారు.
వీటిపై పాలకులు అప్పుడే పట్టించుకుంటే ఇంతటి నష్టం జరగకుండా ఉండేదని అందరూ అభిప్రాయపడ్డారు. ఇక వీటన్నంటిని కేటీఆర్ ఒప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే కేటీఆర్ మరిచిపోయిన సంగంతి ఏంటంటే..జనాలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటున్నారు తప్పా..తమ పాలనపై వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని ఒప్పుకోకపోవడం గమనార్హం.