Bolgam Srinivas : మండల స్థాయి రిపోర్టర్ నుంచి సీఎంపీఆర్వో దాక.. బొల్గం శ్రీనివాస్ ప్రస్థానమిదే..
Bolgam Srinivas : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో(పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)గా నియమితులయ్యారు. ఆయనతో పాటు మామిడాల శ్రీనివాస్ కూడా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బొల్గం శ్రీనివాస్ సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్. మండల స్థాయి జర్నలిస్ట్ నుంచి ఎదిగి .. ప్రస్తుతం ‘వెలుగు’ దినపత్రికలో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు.
1996లో ఈనాడు పేపర్ లో లోకల్ రిపోర్టర్ గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్ లో చేరి శిక్షణ పొందారు. అనంతరం ఈనాడులో సూర్యాపేట, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారు. ఈనాడు తర్వాత సాక్షి పేపర్ లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బ్యూరో ఇన్ చార్జిగా సేవలందించారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యూరోలోనూ పనిచేశారు. ఆ టైంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో), ఆర్థిక శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల వార్తలను కవర్ చేశారు. సాక్షి తర్వాత వెలుగు దినపత్రిక ప్రారంభం నుంచి అక్కడే పని చేస్తున్నారు.
ప్రస్తుతం వెలుగులో బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయన సీఎం పీఆర్వో గా నియమితులయ్యారు. వెలుగు దినపత్రిక ప్రజల్లో
మంచి ఆదరణ పొందడానికి పనిచేసిన వారిలో శ్రీనివాస్ ది కీలకపాత్ర. మండల స్థాయి నుంచి సీఎం పీఆర్వో దాక ఎదిగినా బొల్గం శ్రీనివాస్ ను గ్రామస్తులు, జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ప్రతిభా పాటవాలు ఉంటే అవకాశాలు మన చెంతకు వస్తాయని శ్రీనివాస్ నిరూపించారని వారు కొనియాడుతున్నారు.