AP News : ఏపీలో మరో దారుణం.. బాలికపై అత్యాచారం, హత్య చేసిన దుర్మార్గులు


AP News : ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు భయపెడుతున్నాయి. దిశ లాంటి చట్టాలున్నా పురుషుల్లో లైంగిక దాడుల వాంఛలు పెరుగుతున్నాయి. అత్యాచారాలకు అమ్మాయిలు, బాలికలు, ముసలివారు ఎవరైతే ఏంటనే కోణంలో లైంగిక దాడులు జరుగుతున్నాయి. దీంతో తల్లిదండ్రులకు కడుపు కోతలే మిగులుతున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల జరిగిన దారుణం అందరిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఈనెల 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. వారి ఇంటిపక్కనే ఉండే ఆటో డ్రైవర్ పాంగి రమేష్ (19) ఆమెను బెదిరించి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెబుతుందని భావించి ఆమెను చంపాలని పథకం రచించాడు.

తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్న సాయం తీసుకున్నాడు. మరోమారు బాలిక ఇంట్లోకి ఇద్దరు వెళ్లారు. ఎలాగూ చంపేస్తాం కదా అని ఆమెపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చీరతో గొంతుకు ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు దూలానికి వేలాడదీసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమార్తెను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

ఈనెల 5న గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలోకి వెళ్లి విచారణ ప్రారంభించారు. దీంతో వీఆర్వో సాయంతో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారం, హత్య కేసులు పెట్టి వారిని రిమాండ్ కు పంపించారు. బాలికపై అత్యాచారం చేసిన వారిపై కఠిన శిక్షలు వేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

TAGS