MIM Vs Congress : ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్.. ఈ పోరాటంలో విజయం ఎవరిది?

MIM Vs Congress

MIM Vs Congress

MIM Vs Congress : తెలంగాణలో  అధికార పార్టీని డిసైడ్ చేసేది మైనార్టీలే. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. మైనారిటీ ఓట్లతో గెలిచే ఎంఐఎం కంచుకోటను బద్దలుకొట్టడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదు. అయితే, మిగిలిన స్థానాల్లో మాత్రం ఎంఐఎం ఎవరికి ఓటువేయమంటే ఆ పార్టీకే మైనారిటీలు ఓటు వేస్తుంటారు. ఒకప్పుడు ఎంఐఎం, కాంగ్రెస్‌ మంచి దోస్తులు. దీంతో మైనారిటీ ఓటు కాంగ్రెస్‌కే వెళ్లింది. ఆ తరువాత స్థానంలో బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్‌ తో తమ మైత్రి కొనసాగుతుందని, వారికే ఓటు వేయాలని అసదుద్దీన్‌ ఇప్పటికే మైనార్టీలను కోరారు.

రెండు దఫాలు మైనార్టీలు గంపగుత్తగా తమ ఓట్లను బీఆర్ఎస్ కే వేశారు. అయితే ఈ సారి  ఎంఐఎం చెప్పిన మాట చెల్లుబాటు అవుతుందా.. లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   ప్రస్తుత పరిణామాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.  మైనార్టీ ఓటు బ్యాంకు  కాంగ్రెస్ కు మరలుతుందనే సందేహాలు ఎంఐఎం లోనూ వ్యక్తమవుతున్నాయి. దీంతో అసదుద్దీన్ కాంగ్రెస్ ను టార్గె్ట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పలు గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.

ఎంఐఎం పార్టీ పలు రాష్ట్రాల్లో తమ అభ్యర్ధులను బరిలోకి దించుతున్నది. అయితే తమకు గెలిచే బలం లేదనే విషయం ఎంఐఎం కు తెలుసు.  అయితే  మైనార్టీ ఓట్లన్నీ చీలడంతో స్థానిక ప్రాంతీయ పార్టీలు గెలవడమో లేదా, కాంగ్రెస్ ఓట్లకు గండిపడడమో జరుగుతున్నది. ఎంఐఎం ఓట్ బ్యాంకు షేర్ కూడా తగ్గుతూ వస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీలో నిలుస్తున్నదంటే పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించడమేనన్న వాదన ముస్లింలలోకి బలంగా వెళ్లింది. దీంతో ఎంఐఎంకు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ మధ్య పోటీ ఉంటుంది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కీలకం. బీజేపీని దెబ్బతీసేందుకు యూపీలో ఎంఐఎం అభ్యర్దులను నిలబెట్టినప్పటికీ అది సమాజ్‌వాదీ పార్టీపై ప్రభావం చూపింది. చివరకు బీజేపీ లాభపడింది.

దీంతో బెంగాల్‌లో ఎంఐఎంను పక్కన పెట్టిన మైనార్టీలు తాము అనుకున్న పార్టీకే ఓట్లు వేశారు. కర్నాటక ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయ్యింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం వ్యూహం బెడిసి కొడతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం మైనారిటీ ఓటర్లలోనూ మార్పు స్పష్టమవుతున్నది. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తున్నదని  రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌ కూడా మైనారిటీ  ఓట్లు తమకు షిఫ్ట్ అవుతున్న విషయాన్ని గ్రహించారు. దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు.  గతంలో మైనారిటీ ఓటు కాంగ్రెస్ వెంటే నడిచింది. ఇందుకు ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయడాన్ని మైనార్టీలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతఆ ఓటు బ్యాంక్‌ మొత్తం బీఆర్‌ఎస్‌కు షిఫ్ట్ అవుతున్నది. అయితే, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి కాంగ్రెస్‌ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది.

దానికి తగ్గట్టే తెలంగాణలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు తెలపడంతోపాటు బీజేపీకి అనుకూలించేలా మజ్లిస్ వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. అందుకే, ఎంఐఎం చెప్పినా ఆ ఓట్లు కాంగ్రెస్‌కే వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  తాజాగా ఓల్డ్ సిటీపై కాంగ్రెస్  దృష్టి సారించింది.

సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో ఓల్డ్ సిటీకి చెందిన మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీం మస్కతిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. పాత‌బ‌స్తీలో స్థానికంగా పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ అలియాస్ అయూబ్ తన కుమారులు షాబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌తో కలిసి పార్టీలో చేరిపోయారు. ఇదే బాటలో టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీఖాన్ సైతం కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. వీరితోపాటు మరికొంత మంది నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు  కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నది.

తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ముస్లింలలోనే ఎక్కువ చర్చ జరుగుతోందని వాదన వినిపిస్తున్నది. ముస్లిం పెద్దల్లోని కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తున్నది. ఈ పరిణామాలను గమనిస్తున్న ఎంఐఎం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ  పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని, అవునో కాదో భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలవాలని రాహుల్‌ గాంధీకి సవాల్ విసిరారు. గెలిచేది షేర్వానీనా, టోపీనా అన్నది తేలిపోతుందని పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై ఎంఐఎం దూకుడుగా వ్యవహరించడానికి కారణం మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్నాయని తేలడమే.  ఈ విషయాన్ని గ్రహించే ఎంఐఎం కాంగ్రెస్ పై దాడి పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీని ఎంపీ అసదుద్దీన్, రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని తెలుస్తున్నది. మున్ముందు ఎంఐంఎ వర్సెస్ కాంగ్రెస్‌ అన్నట్టుగా సాగుతుందా, మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారన్నది వేచి చూడాల్సిందే.

TAGS