Ayodhya Ram Mandir : అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం !
Ayodhya Ram Mandir : అయోధ్యలో జనవరి 22న జరుగుతున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి స్వదేశంలో, విదేశాలలోని భావసారుప్యతగల అతిధులకు ఆహ్వానాలు వ్యక్తిగతంగా అందించారు. ప్రధాని మోడీ, అద్వానీ, సోనియా, ఖర్గే, చిరంజీవి వంటి సెలబ్రిటీలతోపాటు 50 మంది విదేశీ అతిధులు, 4 వేల మంది స్వామిజీలు, శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో అశువులు బాసిన 50 మంది కర సేవకుల కుటుంబాలకు ఆహ్వానాలు పంపారు.
ఈ మహోత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలకి ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ స్ట్రీమింగ్ చేయుచున్నారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనున్నది.
(2020 ఆగస్టు 5 న అయోధ్యలో మోడీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ రోజున కూడా టైమ్ స్క్వేర్ లో (TIME SQUARE) రామ మందిర చిత్రపటాన్ని చూపించారు.)
రామ భక్తుల కొరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ; పంచదార – యాలకులతో చేసిన ఇలా “ఇలాచీదానా” ప్రసాదం ప్యాకెట్లు 5 లక్షలు ఆలయ ట్రస్టు ద్వారా రామ్ విలాస్ & సన్స్ వారు పంపిణీ చేయనున్నారు.
సీతాదేవి జన్మస్థలం – నేపాల్ లోని జనక్ పుర్ అని భక్తుల నమ్మకం. అత్తవారింటి నుంచి రాములవారికి కానుకల డబ్బాలు 500 అయోధ్యకు చేరుకున్నాయి. ఇందులో రాముల వారి కోసం వెండి పాదుకలు – విల్లు – బాణాలు – కంఠహారాలు – గృహోపకరణాలు – పట్టు వస్త్రాలు – చీరలు – మిఠాయిలు ఉన్నాయి. నేపాల్ నుంచి విష్ణు సాలిగ్రామము, పవిత్ర జలం అయోధ్యకు చేరాయి. జానకి మందిర్, పశుపతినాథ్ ఆలయ పూజారులకు సమచితరీతిన ఆహ్వానించడం జరిగింది.
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.
09-01-2024