Congress Better than BJP : బీజేపీ కంటే కాంగ్రెస్ తోనే బెటరేమో..చంద్రబాబుకు వ్యూహకర్తల సూచనలు..
Congress Better than BJP : ఏపీలో రాజకీయాలు నిండు చలికాలంలోనూ హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ మార్పులు, చేర్పులతో అభ్యర్థుల ప్రకటనలు చేస్తూ వెళ్తోంది. ఇక టీడీపీ-జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. మొదటగా కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సైతం ప్రయత్నిస్తున్నాయి. జనసేన బీజేపీతోనే ఉన్నా.. టీడీపీ-జనసేన కూటమితో కలుస్తామని బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడిదే విషయమై చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ పార్టీని గద్దె దించడానికి కేంద్ర పార్టీ అయిన బీజేపీని కలుపుకుంటే ఈజీగా తమ ప్రయత్నం విజయవంతమవుతుందని వారు భావిస్తున్నారు. ఏపీలో ప్రధానంగా రెండు పెద్ద పార్టీలు పోగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఉన్నాయి. అయితే ఇందులో మిగతా మూడింటి పరిధి చాలా స్వల్పమే. వామపక్షాలతో పొత్తుకు చంద్రబాబు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తే తమకు లాభదాయకమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఆయనకు తాజాగా రాజకీయ వ్యూహకర్తలు మాత్రం కొన్ని సూచనలు చేశారట. వాటిపై చంద్రబాబు కూడా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారు చేసిన సూచనలు ఏంటో చూద్దాం..
చంద్రబాబు, పవన్ లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కన్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే మంచిదని వ్యూహకర్తలు చెపుతున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ లోకి వైసీపీ అసంతృప్తులు, సీటు రాని నాయకులు చేరుతారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంటుంది. ఇక జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చీలకుండా ఉంటుంది. జగన్ పై అస్త్రంగా షర్మిలను వాడుకుని జగన్ కుటుంబపరంగా, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇక బీజేపీతో పొత్తు వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు అని అంటున్నారు.
బీజేపీ కూడా పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటోంది.. ఆ పార్టీ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతో బీజేపీతో పాటు కూటమి కూడా ఆ వ్యతిరేకత ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. బీజేపీతో వచ్చే లాభం కన్నా నష్టమే పెద్దగా ఉంది. ఇక కాంగ్రెస్ లో ఈసారి తప్పక అధికారంలోకి రావాలనే కసి ఉంటుంది.. అలాగే ఆ అగ్రనేతలు కూడా ఏపీ వచ్చి ప్రచారం చేస్తారు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అక్కడి సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడే. తెలంగాణలో కాంగ్రెస్ పై ఉండే పాజిటివ్ వైబ్స్ ఆంధ్రాలోనూ వర్కవుట్ కావొచ్చు. తెలంగాణ నేతల నుంచి నైతిక సాయం కోరవచ్చు.
ఇక అన్నింటికంటే ప్రధానమైనది పవన్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ తో జతకలిసి, చంద్రబాబు కనుక చిరంజీవితో చర్చిస్తే ఆయనతోనూ ప్రచారం చేయించవచ్చు. ఇలా అన్నాదమ్ముళ్ల క్రేజ్ తోనూ కూటమికి మరింత మైలేజ్ రావొచ్చు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వారు చంద్రబాబుకు సూచిస్తున్నారు. ఈ సూచనలపై చంద్రబాబు, పవన్ కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ నేతలు జాతీయ పార్టీలతో పొత్తులు, తమ అభ్యర్థుల ఖరారు పనిలోనే ఉన్నారు. త్వరలోనే వీటిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.