AP Congress : ఏపీలో కాంగ్రెస్ కు ఊపు తెస్తారా? వైఎస్ జమానా పునరావృతమయ్యేనా?

AP Congress

AP Congress

AP Congress : ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? మళ్లీ పాత రోజులు వస్తాయా? వైఎస్ జమానా నాటి హవా వస్తుందా..అంటే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనపడడం లేదు. దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు.  మెజార్టీ జనాల అభిప్రాయం కూడా అదే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఇక తెలంగాణలోనూ అధికారంలోకి రావడానికి తొమ్మిదేండ్లన్నర సమయం పట్టింది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదురించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ కాంగ్రెస్ అంతా జగన్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యింది.

ఏపీ విభజన చేసిన కాంగ్రెస్ కు జనాలు తీవ్రమైన పనిష్ మెంట్ ఇచ్చారనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో పాతాళానికి తొక్కేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.8శాతం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలిగింది.  వైఎస్ మరణం తర్వాత ఏపీలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. తాజాగా వైఎస్ కూతురు షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో .. ఆ పార్టీకి కొద్దిగా ఆశలు రేగుతున్నాయి. ఏపీలో పార్టీకి షర్మిల ఇప్పుడొక దిక్సూచిగా మారారు.

షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ లో ఇప్పటికప్పుడు అద్భుతాలు జరుగవు. కాకపోతే కొద్ది ఓట్ల శాతం మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొన్నటిదాక తెలంగాణ కోడలినంటూ రాజకీయాలు చేసిన షర్మిల మళ్లీ..ఇప్పుడు ఆంధ్రాబిడ్డను అంటూ రాజకీయాలు చేయాల్సి రావడాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక షర్మిల పార్టీతో వైసీపీకి మాత్రం కొద్దిపాటి ఎఫెక్ట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. జగన్ రెండో సారి సీఎం కావడానికి సిట్టింగులను మారుస్తున్నారు. వీరంతా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు లేవు..ఎందుకంటే అక్కడ చాన్స్ దొరికే పరిస్థితి లేదు. ఇక మిగిలినవి వామపక్షాలే. అందులోకి వెళ్లలేరు. వారికి మిగిలింది ఇక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్సే. అసంతృప్తులకు ఏకైక ఆశాదీపం షర్మిల, కాంగ్రెస్ మాత్రమే.  ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెనక నడుస్తానని చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సుధాకర్ బాబు లాంటి సీనియర్ నేతలు షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా కాస్త పెద్ద నేతలు వస్తే కాంగ్రెస్ గతంలో కన్నా కాస్త మెరుగైన ఓట్లనే రాబట్టే అవకాశమైతే ఉంది.

రాహుల్ భావిస్తున్నట్లు 15శాతం ఓట్లు రాకపోయినా కనీసం 8-10శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బలమైన పార్టీలు వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్య హోరాహోరీ నడిచే అవకాశం ఉంది. ఆ పార్టీలకు దీటుగా కాంగ్రెస్ రాణించగలుగుతుందా అంటే అనుమానమే. ఇప్పటికిప్పుడు కాకపోయినా 2029 నాటికి కొద్దోగొప్పో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

TAGS