Modi in Lakshadweep : లక్షదీవుల్లో మోదీ.. సముద్రగర్భంలో సాహసం..
బుధవారం ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. బీచ్ లో కాసేపు కూర్చొని సేద తీరారు. పుస్తకాన్ని కూడా చదివారు. అంతే కాదు.. ఎవరూ ఊహించని రీతిలో సముద్రంలో స్నార్కెలింగ్ (సాహసంతో కూడిన స్విమ్మింగ్) కూడా చేశారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా తిలకించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
‘‘లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి ముచ్చటేసింది. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని కట్టిపడేస్తాయి. 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు మీ లిస్ట్ లో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోండి’’ ఆయన రాసుకొచ్చారు.
అలాగే తాను అక్కడ స్నార్కెలింగ్ కూడా ప్రయత్నించినట్టు చెపుతూ ఆ ఫొటోలను కూడా షేర్ చేశారు. పగడపు దీవులు, చేపల ఫొటోలను కూడా పంచుకున్నారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని పేర్కొన్నారు.
కాగా, స్నార్కెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్కెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్ ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడుతారు. ఈ స్నార్కెలింగ్ తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేశించవచ్చు.