Sharmila Join to Congress : షర్మిల కాంగ్రెస్ లో చేరేది ఎల్లుండే.. రేపు సాయంత్రం ఢిల్లీ పయనం
Sharmila Join to Congress : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్ టీపీని స్థాపించి గత మూడేండ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిల..ఎలాంటి విజయాలను సాధించలేకపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేకపోయారు. ఈక్రమంలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసి ఆ పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో అన్ని విషయాలు మాట్లాడుకున్న షర్మిల.. జనవరి 4(ఎల్లుండి)న ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈమేరకు ఇవాళ ఇడుపులపాయలో కీలక ప్రకటన చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఈనెల 4న షర్మిల చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు జాతీయ మీడియాకు తెలియజేశాయి. 4న ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం వరుస ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షర్మిలకు హైకమాండ్ ఆహ్వానం కూడా పంపినట్టు సమాచారం.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ నేతలతో ఆమె చర్చిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనంతో పాటు తమ చేరికలపైనా నేతలకు క్లారిటీ ఇస్తారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లి కీలక ప్రకటన చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. అయితే షర్మిలకు ఏపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తారా? లేక ఏఐసీసీ పదవి ఇచ్చి సరిపెడతారా? అన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోందనే చెప్పాలి.
కాగా, కాంగ్రెస్ లో చేరాక షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పేందుకు రాహుల్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడే అవకాశం ఉంది.
అయితే 4న వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారనే ప్రచారంపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2 రోజులు ఓపిక పట్టండి.. అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది’’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, ఆమె రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశం కానున్నారు.