Mansoor Ali khan:మన్సూర్‌కు బిగ్ షాక్..జరిమానా విధించిన హైకోర్టు
Mansoor Ali khan:నటుడు మన్సూర్ అలీఖాన్‌కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై ఆయన వేసిన పరువు నష్టం కేసును మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. ఫేమ్ పొందడం కోసమే నటుడు మన్సూర్ అలీఖాన్ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ కేసును మన్సూర్‌పై త్రిష పెట్టాలని సూచించింది. నటిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనకు రూ.లక్ష జరిమానా విధించింది.
అయితే ఆ డబ్బును అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు అందజేయాలని అదేశించింది. `దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన `లియో` విడుదలైన తరువాత మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, `లియో`లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందనుకున్నానని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనుకున్న సన్నివేశం లేకపోవడం తనని బాధించిందన్నాడు.
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం త్రిష వరకు వెళ్లింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్, చిరంజీవి, ఖుష్బూ, నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా త్రిషకు తమ మద్దతును తెలియజేశారు. అయితే చిరంజీవి, ఖుష్బూ, త్రిషల వల్ల తన పరువుకు భంగం కలిగిందని ఆరోపణలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం కింద రూ.కోటి డిమాండ్ చేస్తూ ఈ ముగ్గురిపై దావా వేశారు.