2018 Movie:ఆస్కార్ అవార్డ్స్‌ షార్ట్ లిస్ట్‌..`2018` మూవీకి చేదు అనుభ‌వం

2018 Movie:ఆస్కార్ అవార్డుల‌ని సినీ న‌టులు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భ‌విస్తుంటార‌న్న‌ది తెలిసిందే. ప్ర‌తి ఏడాది ఆస్కార్ రేసులో నిల‌వాల‌ని, ఏదో ఒక విభాగంలో అయినా అవార్డుని ద‌క్కించుకోవాల‌ని హాలీవుడ్ స్టార్స్ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న న‌టీన‌టులు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్‌` ద్వారా మ‌న‌కు ఆస్కార్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే వ‌చ్చే ఏడాది ఆస్కార్ రేస్ కోసం చాలా సినిమాలు పోటీప‌డుతున్నాయి.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ కోసం చాలా విభాగాల్లో ప‌లు దేశాల నుంచి సినిమాలు, డాక్యుమెంట‌రీలు పోటీప‌డుతున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్ప‌ట‌కిఏ ఎంట్రీలు కూడా వెళ్లాయి. అయితే దాదాపు 10 విభాగాల్లో పోటీప‌డుతున్న సినిమాల‌కు సంబంధించిన జాబితాను తాజాగా క‌మిటి విడుద‌ల చేసింది. హాలీవుడ్ చిత్రాలు `బార్బీ`, `ఓపెన్ హైమర్‌` చిత్రాలు అత్యధిక విభాగాల్లో పోటీప‌డుతున్నాయి.

ఇక బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో భార‌త్ నుంచి అధికారికంగా ఎంపికైన `2018` సినిమా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. ఆస్కార్ పోటీలో ఈ సినిమా లేక‌పోవ‌డంపై ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ పెద‌వి విరుస్తున్నారు. యూకెకు చెందిన `ది జోన్ ఆఫ్ ఇంట్ర‌స్ట్‌`, డెన్మార్క్‌కు చెందిన `ది ప్రామిస్ ల్యాండ్‌`, జ‌పాన్‌కు చెందిన `ప‌ర్‌ఫెక్ట్ డేస్‌` చిత్రాలు ఈ కేట‌గిరిలో ముందున్నాయి.

2018 సినిమా విష‌యానికి వ‌స్తే కేర‌ళ‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించారు. మ‌ల‌యాళంలో రూపొందిన ఈ సినిమా ఇత‌ర భాష‌ల్లోనూ మంచి ఆద‌ర‌ణ పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్లు వ‌సూలు చేసి ఔరా అనిపించింది. టివినో థామ‌స్ ప్రధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీని జూడ్ ఆంథోనీ జోసెఫ్ రూపొందించారు. ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్న ఈ సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకోక‌పోవ‌డం నిజంగా విచార‌క‌రం.

TAGS