Dunki Movie Telugu Review:`డంకీ` మూవీ రివ్యూ


Dunki Movie Telugu Review:షారుక్ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌష‌ల్‌, బొమన్ ఇరానీ, దియా మిర్జా, స‌తీష్ షా, విక్ర‌మ్ కొచ్చ‌ర్‌, అనిల్ గ్రోవ‌ర్‌, జ్యోతి సుభాష్‌, అరుణ్ బాలి, అమ‌ర్ దీప్ ఝా త‌దిత‌రులు న‌టించారు.

సినిమాటోగ్ర‌ఫీ:సీకె ముర‌ళీధ‌ర్‌, మ‌నుష్ నంద‌న్‌,
ఎడిటింగ్:రాజ్ కుమార్ హిరాణీ
నేప‌థ్య సంగీతం:అమ‌న్ పంథ్‌
పాట‌లు:ప్రీత‌మ్‌
ర‌చ‌న:అభిజ‌త్ జోషీ, రాజ్ కుమార్ హిరాణి
నిర్మాత‌లు గౌరీ ఖాన్‌, రాజ్ కుమార్ హిరాణి , జ్యోతి దేశ్‌పాండే
ద‌ర్శ‌క‌త్వం:రాజ్ కుమార్ హిరాణి

నాలుగేళ్ల విరామం త‌రువాత `ప‌ఠాన్‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ రీసెంట్‌గా `జ‌వాన్‌`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు స‌క్సెస్‌ల త‌రుశాత రాజ్ కుమార్ హిరాణి తో షారుక్ చేసిన మూవీ `డంకీ`. విభిన్న‌మైన క‌థ‌ల‌తో మ‌న‌సుకు హ‌త్తుకునే సినిమాలు చేస్తున్న రాజ్ కుమార్ హిరాణి , వ‌రుస విజ‌యాల‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన షారుక్ ఖాన్ తొలి సారి క‌లిసి చేసిన సినిమాకావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు పేర్ప‌డ్డాయి. షారుక్ త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌రైన‌న క‌థ ఇద‌ని చెప్ప‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల్లోనూ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి గురువారం విడుద‌లైన `డంకీ` అంచ‌నాల‌కు అనుగుణంగానే ఉందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థేంటంటే?:

పంజాబ్‌లోని చిన్న ప‌ల్లెటూరికి చెందిన వాళ్లు మ‌న్ను (తాప్సీ), సుఖీ (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌)
బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌).. ఒక్కొక్క‌రిదీ ఒక్కో స‌మ‌స్య‌. వాటిని నుంచి గ‌ట్టెక్కాలంటే ఇంగ్లాండ్ వెళ్ల‌డ‌మే మార్గం. కానీ వీసాల‌కు త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వ‌ద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి ప‌ఠాన్ కోఠ్‌కు జ‌వాన్ హ‌రిదాయాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హ‌ర్ధీసింగ్ (షారుక్ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఇందు కోసం ర‌కర‌కాల ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తాడు. వీసా ఇంట‌ర్వూల్లో గ‌ట్టెక్కేందుకు వీరింతా క‌లిసి గులాటీ (బొమ‌న్ ఇరాని) వ‌ద్ద ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కానీ ఆ ఐదుగురిలో ఒక‌రికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. మిగిలిన‌వారికి దారులు మూసుకుపోతాయి. అయినా స‌రే అక్ర‌మ మార్గాన‌ (డంకీ ట్రావెల్‌) ఇంగ్లాండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని నిర్ఱ‌యించుకుంటారు. ఈ క్ర‌మంలో వాళ్ల‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? స‌రిహ‌ద్దుల్ని దాటి ఇంగ్లాండ్‌లోకి వెళ్ల‌గ‌లిగారా? ఇంత‌కీ వాళ్ల స‌మ‌స్య ఏమిటీ? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు న‌ట‌న‌:

ప‌ఠాన్‌, జవాన్ లాంటి మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ల త‌రువాత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ న‌టించిన పూర్తి స్థాయి భావోద్వేగ‌భ‌రిత ఎంట‌ర్ టైన‌ర్ ఇది. షారుక్ ని మ‌రో కోణంలో ఆవిష్క‌రించిన సిని మా ఇది. జ‌వాన్ హార్డీసింగ్ పాత్ర‌లో షారుక్ ఒదిగిపోయారు. ప్ర‌థ‌మార్థంలో ఎంత హుందాగా క‌నిపించి ఆక‌ట్టుకున్నారో ద్వితీయార్థంలో భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేశారు. తాప్సీ క‌థ‌కు త‌గ్గ పాత్ర‌లో న‌టించింది. మ‌న్ను పాత్ర‌లో త‌ను చాలా చోట్ల క‌న్నీరు పెట్టిస్తుంది. అనిల్ గ్రోవ‌ర్‌, విక్ర‌మ్ కొచ్చ‌ర్ కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. విక్కీ కౌశ‌ల్ పాత్ర క‌థ‌కు కీల‌కం. పాత్ర నిడివి త‌క్కువే అయినా క‌థ‌కు కీల‌కంగా నిలిచింది. ఆ పాత్ర‌లో విక్కీ ఆక‌ట్టుకున్నాడు. బొమ‌న్ ఇరానీ పంజాబీ ట్యూట‌ర్‌గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు.

సాంకేతిక నిపుణుల తీరు:

సాంకేతిక విభాగాల్లో కెమెరా, సంగీతంకు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. `లుట్ ఫుట్ గ‌యా` అంటూ సాగే పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మిగిలిన పాట‌ల‌న్నీ క‌థ‌లో భాగంగా సాగాయి. అమ‌న్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. క‌నికా థిల్లాన్ రాసిన ఈ క‌థ‌లోనే చ‌క్క‌ని భావోద్వేగాలున్నాయి. అయితే క‌థ‌నం ప‌రంగానే మ‌రిన్ని మెరుగుల దిద్దిఉంటే బాగుండు అనిపిస్తుంది. రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌కుడిగా, ఎడిట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న సినిమాల్లో క‌థ‌తో పాటు స‌న్నిత‌మైన భావోద్వాగాలు త‌ప్ప‌నిస‌రి. అవే `డంకీ`లోనూ ప్ర‌ధానంగా క‌నిపించి సినిమాని ప్రేక్ష‌కుల‌కు చేరువ చేశాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

ఎలా ఉందంటే?:

రాజ్ కుమార్ హిరాణి.. ద‌ర్శ‌కుడిగా ఓ మార్కు ఉంది. సున్నిత‌మైన క‌థ‌ల‌కు చక్క‌ని భావోద్వేగాల‌ని జోడించి మ‌న‌కు హ‌త్తుకునే భావోద్వేగాల‌తో సామాజిక అంశాల‌ని జోడించి తెర‌పై ఆవిష్క‌రించ‌డంతో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. చేసింది త‌క్కువ సినిమాలే అయినా రాజ్ కుమార్ హిరాణి త‌న‌దైన మార్కుని క్రియేట్ చేసుకున్నారు. `డంకీ`ని కూడా త‌న మార్కు సున్నిత‌మైన భావోద్వేగాలు, కామెడీ అంశాల మేళ‌వింపుగా తెర‌కెక్కించారు. మాస్‌, యాక్ష‌న్‌, రొమాంటిక్ స్టార్ అనే ఇమేజ్ ఉన్న షారుక్ ఖాన్ సినిమాలో ఉన్నా ఆ మార్కు ఛాయ‌లు ఆ పాత్ర‌లో ఎక్క‌డా క‌నిపించ‌కుండా ఫ‌క్లు రాజ్ కుమార్ హిరాణి సినిమాగా `డంకీ`ని మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంటుంది. చిత్ర‌మైన న‌లుగురి ప్ర‌యాణం నేప్యంలో సున్నిత‌మైన భావోద్వేగాల్ని సృశిస్తూ, న‌వ్విస్తూ హృద‌యాల్ని బ‌రువెక్కిస్తూ `డంకీ` క‌థ‌, క‌థ‌నాల‌ని న‌డిపించి ప్రేక్ష‌కుల్ని ఇందులో లీనం చేశాడు. అయితే క‌థ‌లోని భావోద్వేగాలు, సునిశిత‌మైన హాస్యం ఆక‌ట్టుకున్నా క‌థ‌నంలో పెద్ద‌గా మ్యాజిక్ లేక‌పోవ‌డం మైన‌స్‌గా మారింది. క‌థ అంతా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతుంది. సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు ఉన్నా కానీ `డంకీ` రాజ్ కుమార్ హిరాణి మార్కు భావోద్వేగాల‌తో హ‌త్తుకుంటుంది.

పంచ్ లైన్: హిరాణి మార్కు భావోద్వేగాల `డంకీ`

రేటింగ్ 3.5

TAGS