Sandeep Vanga:యానిమల్ 2..యానిమల్ 3 కోసం వంగా బిగ్ స్కెచ్
Sandeep Vanga:పఠాన్- జవాన్ తర్వాత బాలీవుడ్ నుంచి యానిమల్ భారీ విజయం సాధించింది. షారూఖ్ నటించిన రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్ తో సంచలనాలు సృష్టించగా, యానిమల్ ఇప్పటికే 850కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. ఫుల్ రన్ లో మరో రూ.150 కోట్లు వసూలు చేస్తుందా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. డంకీ, సలార్ లాంటి రెండు భారీ చిత్రాలు ఈ వారంలో విడుదలవుతున్న క్రమంలో యానిమల్ కి 1000 కోట్ల క్లబ్ సాధ్యమేనా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
సలార్, డంకీ చిత్రాలు భారీ అడ్వాన్స్ బుకింగులతో ప్రారంభమవుతున్నాయని ట్రేడ్ చెబుతోంది. ఇటీవల బుక్ మై షో, ఇతర ఆన్ లైన్ టికెటింగ్ సైట్లు క్రాష్ అవ్వడాన్ని బట్టి సలార్ హీట్ ఏ రేంజులో ఉందో అర్థమవుతోంది. దీంతో యానిమల్ మూడు వారాల తర్వాత టికెట్ విండో వద్ద తన హవాని సాగించడం అంత సులువేమీ కాదని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల దృష్టి ప్రభాస్ సలార్ పై ఉంది. అందువల్ల యానిమల్ గురించిన చర్చ ఏదీ లేదు. కానీ సందీప్ రెడ్డి వంగా చేసిన తాజా ప్రకటన మరోసారి యానిమల్ గురించిన చర్చకు తెర తీసింది. యానిమల్ ఫ్రాంఛైజీలో పార్ట్ 2, పార్ట్ 3 తెరకెక్కిస్తానని సందీప్ వంగా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అందుకు యానిమల్ కథలో స్కోప్ పుష్కలంగా ఉంది. స్వస్థిక్ గ్రూప్ అధినేత బల్బీర్ వారసుడు రణ్ విజయ్ (రణబీర్ కపూర్) తన తండ్రి మీద ప్రేమతో ఎలాంటి విధ్వంశాలకు పాల్పడతాడో మొదటి భాగంలో చూపారు. వరుసకు తన సోదరుడే అయిన అబ్రమ్ తన తండ్రి బల్బీర్ ని చంపేందుకు కుట్రలు పన్నుతుంటే దానిని తెలుసుకుని మరిగిపోయిన రణ్ విజయ్ అతడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.క్లైమాక్స్ లోని భీకర ఫేసాఫ్ లో అతడి మెడను కోసి చంపేస్తాడు రణ్ విజయ్. శత్రువు అంతమయ్యాడని అనుకుంటుండగానే ఇంతలోనే అబ్రార్ సోదరుడు అజీజ్ రూపంలో కొత్త ముప్పు, మరింత బలమైన ముప్పు రణ్ విజయ్ కి ఎదురవుతుంది.
అబ్రార్ కంటే వందరెట్లు దుర్మార్గుడైన అజీజ్ ని సందీప్ వంగా చూపించారు. అబ్రార్ సోదరుడిగా తిరిగి రణబీర్ కపూర్ (అజీజ్ పాత్రధారి)ని పార్ట్ 1 ముగింపులో సందీప్ వంగా చూపించారు. ప్రమాదకారి అయిన అజీజ్ కత్తులు నూరుతుంటే, పార్ట్ 2లో హింసాత్మక సన్నివేశాలకు భారీ యాక్షన్ కు కొదవేమీ ఉండదని ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే ఇప్పుడు పార్ట్ 2 పై సందీప్ ప్రకటన మరింత ఉత్కంఠను పెంచింది. యానిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి వికృతమైన జంతు ప్రపంచపు ఆటల్ని తెరపై చూపించడం ద్వారా కాసులు కొల్లగొట్టేందుకు సందీప్ వంగా సిద్ధమవుతున్నాడని అర్థమవుతోంది. ఎన్ని విమర్శలు ఉన్నా యానిమల్ కథాంశం ప్రజలకు నచ్చింది. సినిమాలో హింస, రక్తపాతం, స్త్రీ ద్వేషం నచ్చకపోయినా ఇవన్నీ సమాజంలో నిత్యం చూసేవేనని కూడా అంగీకరిస్తున్నారు!!