Pallavi prashant:పరారీలో పల్లవి ప్రశాంత్..విధ్వంసంపై ప్రశాంత్ మాటేంటీ?
Pallavi prashant:బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ సంతోషం కొన్ని గంటలు కూడా అతనికి నిలవలేదని తాజా పరిణామాలని బట్టి తెలుస్తోంది. ప్రశాంత్‌ని విన్నర్‌గా ప్రకటించిన తరువాత జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద, కృష్ణానగర్ రోడ్లపై పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు విధ్వంసం సృష్టించారు. రోడ్లపై ఉన్న ఆరు ఆర్టీసీ బస్‌ల అద్దాలని పగుల గొట్టి విధ్వంసం సృష్టించారు.
ఈ విధ్వంసానికి ప్రధాన కారకుడిగా పల్లవి ప్రశాంత్‌ని నిర్ధారించిన జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని ఏ-1గా చేర్చి అతని కోసం గాలిస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం తన ఫోన్‌ని స్విఛాఫ్ చేసి పరారీలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశాంత్ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించడంతో అమర్ దీప్ అభిమానులు గొడవకు దిగారు.
దీంతో ప్రశాంత్, ,అమర్ దీప్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు, బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ని రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. అయితే ప్రశాంత్ మాత్రం పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికే ఓపెన్ టాప్ కారులో చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి విధ్వంసానికి దారితీసింది. ఇదే ఇప్పుడు అతన్ని ఏ1గా నిలిచేలా చేసింది. ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో పల్లవి ప్రశాంత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ప్రశాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. `ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు నాకు ఘన స్వాగతం పలికి ఎంతో మంది నా కోసం వచ్చారు. అన్నా మీడియా మిత్రులు మీరే చూశారు. నా కోసం ఇంత మంది వస్తారని, ఇంత మంది నన్నె గెలిపించారని నేను ఆ సంతోషంలో ఉన్న. ఆ సంతోషం ఎంతోసేపు లేకుండా చేయాలని చాలా మంది చూస్తున్నారు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామనుకుంటే దీన్ని కూడా నెగెటివ్‌గా చూస్తారని నాకు భయమవుతోంది. ఎంతకంటే 60 నుంచి 70 యూట్యూబ్ ఛానళ్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల నుంచి వేల మంది అభిమానులు వచ్చారు.
ఇంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫొటోలు, బైట్లు ఇచ్చాను. నేను అన్నం తినలేదు. అన్నం తనడానికి వెళితే..అక్కడికి వచ్చిన ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నారు. నాకు ఓపికలేదు.. నేను అన్నం తినాలి అన్నా వినలేదు. బైట్లు ఇవ్వలేదని నన్నే తిడుతున్నారు` అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.