Salaar:`సలార్` టికెట్ ధరలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్
Salaar:మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ `సలార్` డిసెంబర్ 22న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ వారు అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఈ సినిమాని నైజాంలో పంపిణీ చేస్తున్న మైత్రీమూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. నైజాం ఏరియాలో ఈ రోజు రాత్రి 8:24 గంటలకు ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా టికెట్ ధరల పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. ఏపీలో టికెట్ ధరను రూ.40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. స్టార్ హీరోలు, అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్ విషయంలో నిబంధనల మేరకు మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుతిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో `సలార్`ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్ల విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూర్లు కోరగా వెసులు బాటును కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు అంటే వారం రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్థ్రరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతించింది. సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వో పేర్కొంది. ఏపీలో రూ.40 (సాధారణ థీయేటర్లు, మల్టీప్లెక్స్‌లలో) పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. సినిమా విడుదలైన పది రోజుల వరకే పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అదనపు షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.