Sreeleela:షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల..కారణం ఏంటంటే..
Sreeleela:టాలీవుడ్లో వరుస సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ఏ స్టార్ హీరో సినిమా గురించి ఆరా తీసినా ముందుగా వినిపిస్తున్న పేరిది. అంతగా వరస క్రేజీ సినిమాలతో బిజీగా ఉంటూ టాలీవుడ్లో మేకర్స్‌కు హాట్ ఫేవరేట్‌గా మారింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి రూపొందించిన `పెళ్లిసందD`సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులు పులకరించేలా చేసింది.
టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న శ్రీలీల ఇప్పటికే ఉస్తాద్ రామ్‌తో `స్కంద`, నందమూరి బాలకృష్ణతో `భగవంత్ కేసరి`, పంజా వైష్ణవ్ తేజ్‌తో `ఆదికేశవ`, `ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్` వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఏడాది శ్రీలీల నటించిన చిత్రాల్లో `భగవంత్ కేసరి` మినహా ఏ మూవీ కూడా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో శ్రీలీల కొంత నిరాశకు గురైంది.
ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ సూపర్ స్టార్ మహేష్‌తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న `గుంటూరు కారం`మీదే ఉన్నాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్`తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న శ్రీలీల సడన్‌గా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది.
కొద్ది రోజుల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండనుందని తెలిసింది. ఉన్నట్టుండి శ్రీలీల ఇలా షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీలీల యాక్టర్ మాత్రమే కాదు.. కాబోయే డాక్టర్ కూడా. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వైద్య విద్యను పూర్తి చేస్తోంది. త్వరలో శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తోంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని కోసమే శ్రీలీల ఇటీవల ముంబాయి వెళ్లినట్లు తెలిసింది. పరీక్షలు పూర్తయ్యే వరకు ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనరట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలీల తల్లి కూడా డాక్టరే కావడం విశేషం.