Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్-7 విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. చివరి వరకూ నటుడు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. `ఉల్టాపుల్టా` అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభమైన ఈ సీజన్ మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొదటి రోజు 14 మంది, 35వ రోజు ఐదుగురు హౌస్‌లోకి వచ్చారు.
చివరికి టాప్ 6లో ఫైనలిస్టులుగా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక, యావర్ నిలవగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్ మనీతో పాటు వితారా బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యూయలరీ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ `నాకు ఓటు వేసిన అన్నతమ్ములకు, అక్కచెల్లెళ్లకు రుణపడి ఉంటా. తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ.. జనం మెచ్చిన రైతుబిడ్డగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా.
నేను ఇక్కడకు రావాలని ఎన్నో రోజులు తిరగా. భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి. కానీ నన్ను నేను నమ్ముకున్నా.. నేను చేయగలనని అనుకున్నా. ఇదే విషయాన్ని మా బాపుకు చెప్పా. `నీ వెనకాల నేనున్నా` అని ధైర్యం చెప్పాడు. నాగార్జున సర్‌ను చూడగానే మాటలు రాలేదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చాలా మంది జీవితాలు బాగుపడతాయి. నేను గెలుచుకున్న రూ.35 లక్షల్లో ప్రతి ఒక్క రూపాయి రైతులకే పంచుతా. మాట తప్పను.. జై జవాన్..జై కిసాన్` అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
రవితేజతో నటించే అవకాశం.
బిగ్‌బాస్ సీజన్ 7లో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌కు మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించే అవకాశం దక్కింది. `ఈగల్` మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రవితేజ బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, రవితేజ, అమర్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అమర్ బయటకు వస్తే రవితేజ సినిమాలో నటించే అవకాశం ఇస్తామని నాగార్జున చెప్పడంతో మరో ఆలోచన లేకుండా అమర్ హౌస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అమర్ అభిమానానికి ఫిదా అయిన రవితేజ తన తరువాత సినిమాలో తనకు నటించే అవకాశం ఇస్తానని మాటిచ్చారు.