TDP : అండమాన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం
TDP : అండమాన్ నికోబార్ దీవుల్లో కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన విజయాన్ని సాధించింది. దక్షిణ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ కౌన్సిల్ (ఎ్సవీపీఎంసీ) చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన ఎస్.షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. ఆయన టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీచేశారు.
గురువారం జరిగిన ఎన్నికలో మొత్తం 24 ఓట్లకు గాను 15 ఓట్లు సాధించిన హమీద్, సిట్టింగ్ చైర్పర్సన్, కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ శర్మను ఓడించారు. ఈ విజయంతో అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ గెలుచుకున్న రెండో పట్టణంగా శ్రీవిజయపురం నిలిచింది. గతంలో పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవిని టీడీపీ మహిళా కార్పొరేటర్ సెల్వి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అండమాన్ ఇన్చార్జి వి.మాధవనాయుడు శ్రీవిజయపురంలోనే ఉండి ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈ విజయం.. టీడీపీ-బీజేపీ కూటమిపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ అధ్యక్షుడు ఎన్.మాణిక్యరావ్ యాదవ్ అన్నారు.
హమీద్ ఎన్నికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రజాసంక్షేమమే ఎజెండాగా టీడీపీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాన్ని అందించిన అండమాన్ ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.