Deputy Chief Minister : ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్‌తో JEE పరీక్షకు ఆలస్యమైన విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Deputy Chief Minister Pawan Kalyan (File Photo)
Deputy Chief Minister : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తిలోని ఒక పరీక్షా కేంద్రంలో JEE అడ్వాన్స్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తీవ్రంగా ఆలస్యమయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. ఉదయం జరిగిన ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో వారు పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మా పిల్లలు ఏడాది పొడవునా ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్కసారి జరిగిన ఆలస్యం వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది,” అని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతగా ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడవద్దని మరొక తండ్రి అన్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.