Home Minister Anita : విశాఖలో అత్యాచార ఘటన.. స్పందించిన హోంమంత్రి అనిత

Home Minister Anita

Home Minister Anita

Home Minister Anita : విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీసు కమిషనర్ తో మంత్రి అనిత ఫోన్ లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని ఎన్ వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె సహచరి విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ, ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు ఆమెను తీసుకుని వెళ్లాడు. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మళ్లీ అదే నెల 13వ తేదీన డాబా గార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా అక్కడికి వచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి, బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, రెండు నెలల తర్వాత మళ్లీ ఆనంద్, రాజేష్, జగదీష్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు. దీంతో, ఈ విషయం వంశీ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఈ నెల 18వ తేదీన బాధితురాలు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకొని, ఏం జరిగిందని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విశాఖ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

TAGS