Puri Musings :కాకి.. హంస.. చిలుక.. నెమలి.. ఎవడి కష్టాలు వాడివి: పూరి
Puri Musings :టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఎందరో హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అదే సమయంలో ఎన్నో అపజయాలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే.. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాడు. అలాగే.. ‘పూరీ మ్యూజింగ్స్’ అనే పాడ్కాస్ట్ ద్వారా పూరీ తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు. తాజాగా ఆయన‘అన్హ్యాపీనెస్’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా కాకి కథ చెప్పారు. ‘‘ఒక కాకి, చెట్టు మీద కూర్చొని ఏడుస్తుంటుంది. అదే చెట్టు కింద కూర్చొన్న సాధువు ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడుగుతాడు. అప్పుడు కాకి, ‘నేను నల్లగా ఉంటాను. ఎవరూ నన్ను పెంచుకోరు. ముద్దు చేయరు. నన్ను ప్రేమించే వాళ్లే లేరు. ఏ ఇంటి మీద వాలినా నన్ను కర్రతో కొడుతున్నారు. నా మీద నాకే చిరాకు పుడుతుంది స్వామీ. ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు. నా జీవితమే ఇలా ఉంది’ అని అన్నది. ‘ఎవరు బాగున్నారు’ అని అడిగాడు సాధువు. ‘అదిగో అక్కడ హంసను చూడు స్వామీ. ఎంత అందంగా పుట్టిందో’ అంటుంది. ‘ఒకసారి వెళ్లి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కో’ అన్నాడు సాధువు’’
‘‘కాకి వెళ్లి హంసను కలిసింది. అప్పుడు హంస ‘నాదీ ఒక అందమేనా? నా బొంద. తెల్ల సున్నం కొట్టి దేవుడు ఇక్కడ పడేశాడు. ఒంటి మీద ఒక రంగు లేదు. ఎప్పుడూ ఈ కొలనులోనే తిరుగుతూనే ఉండాలి. నాదీ బతుకేనా. ఆ చిలుకను చూడు రంగు రంగులతో ఎలా పుట్టిందో ’అని హంస ఏడ్చింది. కాకి వెళ్లి చిలుకను కలిసింది. ‘ఇంత అందంగా పుట్టావు కదా సంతోషంగా ఉన్నావా’ అని అడిగింది. ‘నేను అందంగా పుట్టడమే నాకు శాపమైంది. ఈ దుర్మార్గపు మనుషులు నన్ను పంజరంలో బంధిస్తున్నారు. అది ఎంత నరకమో నీకేం తెలుసు. నేను ఎగరలేను. ఎక్కడికీ వెళ్లలేను. జీవితాంతం జైలులో బతకాలి. నా కంటే నెమలి జీవితం బెటర్’ అనుకుంటూ అదీ ఏడ్చింది’’
‘‘ఆఖరికి కాకి వెళ్లి నెమలిని అడుగుతుంది. అప్పుడు నెమలి… ‘నన్ను తీసుకొచ్చి ఈ జూలో పడేశారు. రోజూ టూరిస్టులు రావడం నాతో ఫొటోలు దిగడం, పురి విప్పమని ఒకటే టార్చర్ పెట్టేస్తున్నారు. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఏ మూడ్ లేకుండా ఎందుకు పురి విప్పాలి. ఒసేయ్ కాకి, నీ జీవితమే బాగుంది. ఎవరూ నిన్ను ప్రేమించరు. పట్టించుకోరు. నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు. కడుపునిండా తింటావు . ఎగురుతావు. ఇంతకన్నా ఏం కావాలి. నిన్ను చూస్తే అసూయగా ఉంది’ అని అంటుంది. ఆ మాటలు విని కాకి మతిపోయింది. పక్కవాడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం. డబ్బు ఉన్నవాడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం. ఏమీ కాదు. ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలబడ్డాయి.’’ అంటూ ముగించారు పూరి